పథకాలకు తగ్గట్టుగా.. ప్రచారం లేదు..!
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
కేసముద్రం, జులై 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, సన్న బి య్యం, రేషన్ కార్డుల జారీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం తదితర సం క్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అ యితే పథకాల అమలకు తగ్గట్టుగా ప్రభుత్వానికి ఆశించిన విధంగా ప్రచారం లభించడం లేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని, గత ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూ డా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని అ యినప్పటికీ ప్రచారంలో పూర్తిగా వెనుకబడ్డామని పేర్కొన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో గురువారం రైతు వేదికలో నిర్వహించిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చె క్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎ మ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎ న్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రచారంలో మాత్రం ఆ విధంగా గుర్తింపు రావడంలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న వారంతా తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం నుండి పొందిన లబ్ధిని ఇతరులకు వివరించాలని కో రారు. ఇలా పదిమందికి చెబితేనే ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చే యడానికి ‘బూస్ట్’ గా ఉపయోగపడుతుందన్నారు.
ఐదు రోజుల గడువున్న చెక్కుల పంపిణీ!
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమంలో 44 మంది లబ్ధిదారులకు మూడు నెలల క్రితం జారీ చేసిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. 44 మందికి గత ఏప్రిల్ నెలలో మూడు నెలల కాల వ్యవధితో ఒక్కొక్కరికి 1,00.116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కులు జారీ చేశారు. ఈ నెల 29 తేదీన ఆ చెక్కుల మూడు నెలల గడువు ముగిసిపోనుంది. కేవలం ఐదు రోజుల వ్యవధి ఉన్న చెక్కులను పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు ఉరుకులు పరుగులు పెట్టి బ్యాంకులో జమ చేసుకోవాల్సి వచ్చింది.
ఏప్రిల్ నెలలో మూడు నెలల వ్యవధితో జారీ చేసిన చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. కనీసం నెలరోజుల ముందు, లేదంటే చివరకు పక్షం రోజుల ముందు అయినా చెక్కులు పంపిణీ చేస్తే బాగుండేదని, ఇప్పుడు కేవలం ఐదు రోజుల గడువు ఉందని, అందులో నాలుగవ శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు రావడంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే చెక్కులు బ్యాంకులో సమర్పించాల్సి వస్తోందని వాపోయారు.






