7 March, 2026 | 5:51 AM

99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

07-03-2026 01:23 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, మార్చి 6 (విజయక్రాంతి): 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం బాలెంల గ్రామపంచాయతీ  కార్యాలయంలో ప్రజా పాలన-  ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలు పై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నూతనంగా గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు  ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలనీ పిలుపునిచ్చారు.

పెండింగ్ ఫైల్స్ క్లియర్, త్రాగునీరు, విద్యా, వైద్యం పై వచ్చిన దరఖాస్తులు పది రోజులలో క్లియర్ చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనలన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

పేద ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ  ఉద్దేశ్యం అన్నారు. బాలేంల గ్రామంలో ప్రజలతో కలెక్టర్ ముచ్చటించారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్డు, స్టోర్ రూమ్, వంటశాల, కంప్యూటర్ రూమ్ ల్యాబ్ పరిశీలించారు, స్కూలుకు సంబంధించిన బిల్లులు ఆన్లైన్లో ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు.

10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మంచి మార్కులు తెచ్చుకోవాలని, ప్రతి సబ్జెక్టులో నూటికి 70 శాతం మార్కులు రావాలన్నారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల భోజన వసతులు అడిగి తెలుసుకున్నారు, పల్లె దవాఖానాలో ఏ ఎన్ ఎం లతో ముచ్చటించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డిఓ వేణు మాధవరావు, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీఓ లింగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాదు, ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.