7 March, 2026 | 5:55 AM

ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

07-03-2026 01:20 AM
  1. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి

వార్డులు, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో మంత్రులు

ఆయా జిల్లాల్లో అధికారులకు పలు సూచనలు

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 99 రోజులపాటు నిర్వహించే ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రభుత్వం అధికారులు  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వామ్యమ య్యారు.

ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు వార్డులు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరిం చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు  మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఇప్పటికే రెండుసార్లు ప్రజల్లోకి వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 99 రోజులపాటు.. వారానికో ప్రత్యేక విభాగం, శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టింది.

ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరయ్యారు.   మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మహబూబాబాద్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

ఉమ్మడి ఖమ్మంలో ప్రారంభించిన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు ఉమ్మడి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.

గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. పల్లెలు, పట్టణాలు సమగ్రాభివృద్ధి చెందేలా అధికారులు చూడాలని ఆయా జిల్లాల అధికారులకు మంత్రులు సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.