24 August, 2026 | 4:20 AM

ముమ్మరంగా వ్యవసాయ పనులు

24-08-2026 02:46 AM

పెరిగిన కూలీల డిమాండ్ పంటకు పెరుగుతున్న పెట్టుబడి

వాంకిడి, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వాంకిడి మండలంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు రైతులు జూలైలోనే వ్యవసాయ పనులు ప్రారంభించగా, మరికొందరు ఆగస్టు మొదటి, రెండో వారాల్లో పనులు చేపట్టారు. దీంతో మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వ్యవసాయ బావులు, చెరువుల కింద రైతులు వరినాట్లు వేస్తుండగా, పత్తి పంట లో కలుపు తీసే పనులు కొనసాగుతున్నాయి.

కూలీలకు పెరిగిన డిమాండ్....

వ్యవసాయ పనులు ఒకేసారి ప్రారంభం కావడంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆటోలు, ర్యాలీ ఆటోలు, ట్రాక్టర్లలో కూలీలను తరలిస్తున్నారు.ప్రస్తుతం మహిళా కూలీలకు కూడా కూలి పెరిగింది. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు కూలి చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఆటోలో సుమారు 10 నుంచి 15 మంది కూలీలను తరలిస్తున్నారు.కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొందరు రైతు కుటుంబాలు వంతుల వారీగా వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. పాఠశాలలకు సెలవు ఉన్న రోజుల్లో విద్యార్థులు కూడా తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నారు.

కూలీల కొరతతో ఇబ్బందులు:- శ్రావణ్, వాంకిడి

కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభించడంతో ఈ సమస్య ఏర్పడింది. పనులకు పిలిచినా స్థానికంగా కూలీలు అందుబాటులో ఉండటం లేదు. కొందరు కూలీలు వంతుల వారీగా పనులకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కువ కూలి చెల్లించి మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూలీలను తీసుకొస్తున్నాం.