16 July, 2026 | 10:59 PM

పేర్లు చెప్పను కానీ, ఆ రెండు రకాల డైరెక్టర్లనూ చూశా!

16-07-2026 10:58 PM

‘పేర్లు చెప్పలేను కానీ, నా కెరీర్‌లో రెండు రకాల డైరెక్టర్లనూ నేను చూశాను’ అంటూ తన దర్శకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఓ..! సుకుమారి’ సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. యంగ్ హీరో తిరువీర్‌కు జోడీగా నటించింది. ఈ జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలతోపాటు మరికొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లను విలేకరులతో పంచుకుంది కథానాయకి ఐశ్వర్య రాజేశ్. ఆ సంగతులు ఆమె మాటల్లోనే.. 

నేను స్క్రిప్ట్ మొత్తం చదివా. ఇదొక క్యూట్ విలేజ్ స్టోరీ. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నేను చేసిన దామిని పాత్రకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముట్టుకుంటే షాక్ కొడతాను (నవ్వుతూ). అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దామిని కథ. ఆ పాత్ర ప్రయాణాన్ని ప్రేక్షకులు ఎంతో ఆస్వాదిస్తారని నమ్ముతున్నా. 

ఇందులో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా కనిపిస్తారు. ఇద్దరు అన్నదమ్ములుంటారు. ఎవరికి ముందు కొడుకు పుడితే అతనికే ఆస్తి రాస్తానని తండ్రి నిర్ణయిస్తాడు. అదే సమయంలో నేను తిరువీర్ పాత్రకు పరిచయమవుతా. నేను ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిని. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే కథ.  

నేను తెలుగమ్మాయిని కాబట్టి ఏ యాస కూడా నాకు కష్టంగా అనిపించదు. అన్ని ప్రాంతాల యాసల్లో మాట్లాడగలను. అందుకే ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడటం నాకు కష్టంగా ఏమీ అనిపించలేదు. తెలుగు, తమిళ భాషల్లోని వివిధ యాసల్లో నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. 

కొందరు కథ బాగా చెప్తారు, కానీ సినిమాను ఆకట్టుకునేలా తీయలేరు. మరికొందరికి కథ చెప్పడం సరిగ్గా రాదు. అయితేనేం, తమ కథను అద్భుతంగా తెరకెక్కిస్తారు. పేర్లు చెప్పలేను కానీ, నా కెరీర్‌లో ఈ రెండు రకాల డైరెక్టర్లనూ నేను చూశా. నేను ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేశా. ఒక దర్శకుడు కథ చెప్పే విధానం, ఆయనపై కలిగే నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. 

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉండటంతో ప్రతి విభాగంపై కొంత అవగాహన వచ్చింది. మనకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో గానీ, వినడంలో గానీ ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తా. అందుకే దర్శకులకు అప్పుడప్పుడూ సలహాలు ఇస్తుంటా. 

నేను తమిళ్‌లో వరుసగా ఐదు హిట్లు ఇచ్చా. ఆ సంవత్సరం మా ఇంటికి చాలా బొకేలు వచ్చాయి. తర్వాత ఏడాది రెండు హిట్లే వచ్చాయి. అప్పుడు ఇంటికి వచ్చే బొకేల సంఖ్య కూడా తగ్గింది. బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా నాలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే ఈ ప్రయాణంలో నేర్చుకున్నా. 

నేను సినిమాలతోపాటు వరుసగా వెబ్ సిరీసులు కూడా చేయడానికి కారణం.. నేను -ఏ ప్లాట్‌ఫామ్‌నూ వదలకూడదని అనుకోవడమే. వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ ఉంటుంది. నేను చేసిన ‘సుడల్’ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా దాని గురించి చాలామంది మాట్లాడేవారు. అది 34 భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ కోసం ఒక ప్రాజెక్ట్, హాట్‌స్టార్ కోసం మరో వెబ్ సిరీస్ చేస్తున్నా. 

నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే ఇష్టం. ఒకప్పుడు చాలామంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్‌కు మూడేళ్ల స్పాన్ అనేవారు. నేనూ అదే నిజం అనుకునేదాన్ని. అందుకే త్వరగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకున్నా (నవ్వుతూ). అన్నీ కలుపుకొని ఇప్పటివరకు దాదాపు 50 చేశా. నేను చేసిన దాదాపు ప్రతి పాత్ర ఇష్టంతోనే చేసిందే. ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. నీలాంబరి తరహా పాత్రలు చేయాలనుంది. అలాగే అబ్సెషన్ లాంటి పాత్రల్లో కూడా నటించాలని ఉంది.