13 July, 2026 | 3:15 AM

మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహాకాలు

13-07-2026 02:20 AM

రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): ఉన్నత విద్యకై మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా రెడ్డి జన సంఘం ఉపకార వేత నాలను అందించి ప్రోత్సహిస్తుందని సంఘం (అబిడ్స్) అధ్యక్షుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అబిడ్స్‌లోని రెడ్డి బాలుర వసతి గృహం ఆడిటోరియంలో 2026- విద్యా సంవత్సరానికి చెందిన మెడికల్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ ఇతర కోర్సుల్లో మెరిట్ సాధించిన 254 మంది విద్యార్ధినీ విద్యార్థులకు 20 లక్షల 85 వేల రూపాయల చెక్కుల రూపేణా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సంఘం కార్యదర్శి పాండురంగారెడ్డి కాశిరెడ్డి, ఉపాధ్యక్షురాలు అలుక సుకన్యారెడ్డి, కార్యదర్శి డాక్టర్ బి మధు సూదన్ రెడ్డి, సభ్యులు తీగల మోహన్ రెడ్డి, ఎం భారతి, జైపాల్ రెడ్డిలతో కలిసి రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాల చెక్కులను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ఎన్నో ఏళ్లుగా ప్రతి ఏటా దాతల సహకారంతో ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 11 మంది మెడికల్ విద్యార్థులకు 1 లక్ష 32 వేలు, 121 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు 10 లక్షల 85 వేలు, ఇతర కోర్సులు, డ్యుయేషన్‌కు చెందిన 122 మంది విద్యార్థులకు 8 లక్షల 54 వేల రూపాయలను మొత్తంగా 20 లక్షల 85 వేల రూపాయల ఉపకార వేతనాలను పంపిణీ చేశామన్నారు.

కార్యదర్శి పాండురంగారెడ్డి కాశిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా సంఘం అబిడ్స్ ఆధ్వర్యంలో సుమారు 250 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్యకై ఉపకార వేతనాలను అందజేస్తున్నామన్నారు.ఈ ఉపకార వేతనాలను అందించేందుక సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, దాతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.