13 July, 2026 | 3:28 AM

ఇరాన్ దుందుడుకు

13-07-2026 02:23 AM

ఒమన్‌లో భారత నౌకపై దాడి

10 మంది సురక్షితం.. ఒకరు గల్లంతు

దాడిని తీవ్రంగా ఖండించిన భారత్

టెహ్రాన్/న్యూఢిల్లీ, జూలై 12: ఒమన్ తీరంలో 11 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై ఆదివారం ఇరాన్ దళాలు దాడి చేశాయి. దీంతో నౌకలో పెద్దఎత్తున మంటలు చెలరేగగా, సిబ్బంది నౌకను విడిచి, 10 మంది నావికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో భారతీయుడు గల్లంతయ్యాడు.

గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) తెలిపింది. ఆదివారం ఉదయం ఒమన్‌లో జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకపై ఇరాన్ దాడిచేసింది. ఈ దాడిలో మంటలు చెలరేగి సైప్రస్ జెండా కలిగిన జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌక దెబ్బతింది. హోర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసి నట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు, హెచ్చరికగా జరిపిన కాల్పుగా ఈ దాడిని ఐఆర్‌జీసీ అభివర్ణించింది. గెలాక్సీ నౌక అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని టెహ్రాన్ పేర్కొంది.

ఈ ఘటనపై ఎలాంటి ప్రతీకార చర్యకైనా ‘తీవ్రమైన ప్రతిస్పందన’ ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ ఒక ప్రకటనలో పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలలో మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని తెలిపింది. అయితే తక్షణమే ఉద్రిక్తతలను ఆపాలని భారత్ పిలుపునిచ్చింది. మధ్యప్రాచ్యంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల పట్ల తన ఆందోళనను భారత్ స్పష్టం చేసింది.

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై కొనసాగుతున్న దాడుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఉద్రిక్తతలను తక్షణమే ఆపాలని తెలిపింది. దౌత్యపరమైన పరిష్కారం కోసం కొనసాగుతున్న చర్చలను ముగించాలని తాము మరోసారి పిలుపునిచ్చింది. తద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ముగియాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.