వెలుగుచూసిన వరుస హత్యల మిస్టరీ
- మహిళలను చంపి పూడ్చిపెట్టినట్లు ఆరోపణలు
- మొయినాబాద్ పరిధిలో ఘటనలు
మొయినాబాద్ మే 16(విజయక్రాంతి) : మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట గ్రామ సమీపంలో జరిగిన ఇద్దరు మహిళల అదృశ్య ఘటనలు సంచలనాత్మక మలుపు తిరిగాయి. బంగారు ఆభరణాలు, డబ్బుల కోసం పథకం ప్రకారం హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం ఖాసింపూర్‌కి చెందిన అంగన్‌వాడీ ఆయా అబిదా బేగం (65) ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. ఈ విషయంపై ఆమె కుమారుడు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, తాండూర్ పట్టణం ఇంద్రమ్మ కాలనీకి చెందిన కరీంబి అనే మహిళ, ఆమె భర్త రెహమాన్, అలాగే ఫామ్‌హౌస్ సెక్యూరిటీ సిబ్బంది నయూమ్‌దీతిజిజిలపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, అబిదా బేగం వద్ద నుంచి తీసుకున్న రూ.30 వేల నగదు విషయమై ఆమెను నమ్మబలికి మొయినాబాద్ సమీపంలోని దాసరి పద్మ ఫామ్‌హౌస్ వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆమె వద్ద ఉన్న సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని, మృతదేహాన్ని ఫామ్‌హౌస్ వెనుక భాగంలో పూడ్చిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా, రెండు నెలల క్రితం అదృశ్యమైన మహబూబి (62) అనే మరో మహిళ హత్య కేసులో కూడా ఇదే నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
రెండన్నర తులాల బంగారం కోసం ఆమెను కూడా పథకం ప్రకారం హత్య చేసి అదే ఫామ్‌హౌస్ పరిసరాల్లో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. నిందితులు ఇంకా మరెవరైనా వ్యక్తులను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






