మునుగోడు రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలి
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ, (చండూరు)జూలై 26 (విజయక్రాంతి): మునుగోడు రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, యూరియా కొరతతో పాటు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఆదివారం చండూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మునుగోడు రైతాంగానికి అత్యంత కీలకమైన శివన్నగూడెం ప్రాజెక్టుకు డిండి ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపు అంశంపై ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు తమ ప్రాంతానికి నీటి కోసం ప్రభుత్వాన్ని కోరుతున్న తరహాలోనే మునుగోడు రైతుల హక్కుల కోసం కూడా పోరాడాలని సూచించారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పట్ల జరిగిన వ్యవహారం దళిత నాయకుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన విమర్శించారు. అలాగే, ఇతర నియోజకవర్గాల్లో పర్యటించే ఎమ్మెల్యే, సొంత నియోజకవర్గ ప్రజలు, నాయకులను పరామర్శించేందుకు కూడా సమయం కేటాయించడం లేదన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాటి వివరాలను ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు.
మునుగోడు రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వారి సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్లో దీర్ఘకాలంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని, పార్టీ మారిన వారికే పదవులు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరోసారి అవకాశం వస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు ప్రతి నాయకులు పాల్గొన్నారు.






