9 June, 2026 | 4:28 AM

సునంద రైస్ ఇండస్ట్రీస్ లైసెన్స్ రద్దు చేయాలి

09-06-2026 12:36 AM

గరిడేపల్లి, జూన్ 8 : మండల కేంద్రమైన గరిడేపల్లిలోనీ కల్మలచెరువు రోడ్డులో ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న సునంద రైస్ ఇండస్ట్రీస్ అనుమతులను రద్దు చేయాలని మండల ఎమ్మార్పీఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనావాస మధ్యలో ఉన్న రైస్ ఇండస్ట్రీ తో ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆరంజి జోన్లో ఉండాల్సిన రైస్ మిల్ జనావాసాల మధ్యలో ఉండకూడదని తెలిపారు.

నియమ నిబంధనలు పాటించకుండా మిల్లు నిర్మాణం జరగడంతో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 కు విగాథం కలుగుతుం దన్నారు. ఈ మిల్లు నిర్మాణంతో అనేకసార్లు ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని, మిల్లు ఏర్పాటు చేయడం ద్వారా చదువుకునే విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి జనావాసాల, దేవాలయానికి, పాఠశాలకు సమీపంలో ఉన్న ఈ మిల్లు అనుమతులను వెంటనే రద్దుచేసి, గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సమస్యపై విచారణ చేయించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులు నకరికంటి రవి, పిట్ట వెంకటేష్, ఆలంపల్లి శేఖర్, పిట్ట నాగరాజు, కుర్రి వెంకన్న, మచ్చ వేణు, తదితరులు పాల్గొన్నారు.