పెద్ది వచ్చేది జూన్ 4 నాడేనా?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కోసం యావత్తు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, రిలీజ్ డేట్ విషయంలో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెర దించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమవుతోందట.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను జూన్ 25 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల చెప్పారు. అయితే, తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ డేట్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. జూన్ 4న సినిమా వచ్చే అవకాశం ఉందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రీమియర్లు ఉండే అవకాశం ఉందన్న వార్త కూడా తాజాగా వినవస్తోంది. ఈ అయోమయాన్ని తొలగించి, అధికారికంగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ మే 1న హైదరాబాద్‌లో ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటుచేయనుందని సమాచారం. ఈ సమావేశంలో విడుదల తేదీతోపాటు సినిమా షూటింగ్ అప్డేట్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషనల్ ప్లాన్స్ గురించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటానికి గల కారణాలను టీమ్ ఆలస్యం వల్లేనని చెబుతూ వస్తోంది. కానీ, క్వాలిటీ కోసమే ఇన్నిసార్లు వాయిదా నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా షూటింగ్‌లో కొద్దిపాటి భాగమే మిగిలి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. అయినప్పటికీ సీజీ వర్క్, ఫైనల్ అవుట్‌పుట్‌ను మరింత మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో టీమ్ వాయిదా వేస్తోంది. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో మేకర్స్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.






