ఇగో సూడుర్రి వచ్చింది.. కందులోళ్ల సులోచన!
చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ మేవరిక్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ‘భోగి’. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీరాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా ఈ కథలో భాగమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి శర్వా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేసిందీ చిత్రబృందం.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పాత్ర పేరు ‘కందుల సులోచన రాణి’ అని తెలియజేశారు. ఈ పోస్టర్‌లో తలపై మోదుగ ఆకుల సిబ్బి, టిఫిన్ డబ్బాతో ఉన్న అనుపమ ఊరి తొవ్వలో కాలినడకన వెళ్తూ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. మోదుగాకు లతో విస్తర్లు కుడుతూ జీవనం సాగించే సులోచన పాత్రలో అనుపమ పూర్తిగా లీనమైంది.
ఇక ఈ పోస్టర్‌ను డైరెక్టర్ సంపత్ నంది సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. ‘ఇగో మా కందులోళ్ల ఆడబిడ్డ ‘కందుల సులోచనా రాణి’ని కలువుర్రి.. ఈమె మోదుగాకు లెక్క.. అగ్గిపువ్వు లెక్క.. బుగ్గలెక్క ఉంటది కానీ.. ముట్టుకుంటే భోగి లెక్క భగ్గుమంటది’ అంటూ పాత్ర తీరుతెన్నుల గురించి పేర్కొన్నారు. కథానాయకుడు శర్వా పోషిస్తున్న గంగా అనే తుఫాన్‌లాంటి పాత్రకు ఆత్మలా నిలిచే సులోచన ఈ కథలో కీలక పాత్రగా ఉండనుంది.
1960ల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో సాగే కథతో యాక్షన్, భావోద్వేగాలతో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోందీ చిత్రం. ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో తర్వాతి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్‌కుమార్ అరోకియా; ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్; నిర్మాత: కేకే రాధామోహన్; రచన, దర్శకత్వం: సంపత్ నంది.






