1 May, 2026 | 4:06 AM

తెరపైకి ఊహించని కాంబో

01-05-2026 01:36 AM

టాలీవుడ్‌లో ఊహించని మరో కాంబో తెరపైకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఊరమాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఇక క్లాస్ సినిమాలకు దర్శకుడు శేఖర్ కమ్ములది పెట్టింది పేరు. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో వీరిద్దరి దారులు పూర్తిగా భిన్నం. ఇలాంటి విభిన్న శైలుల కలయికలో ఓ సినిమా వస్తుందని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఊహించి ఉండరు! కానీ, ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా చూసే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు కలుగనుంది. ఔను, వీరి కలయికలో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని శేఖర్ కమ్ముల ఓ కథను రాస్తున్నారని సమాచారం. ఆయనను సరికొత్త పాత్రలో చూపించేలా స్క్రీప్టును సిద్ధం చేస్తున్నారని వినికిడి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల, కొరటాల శివ డైరెక్షన్‌లోనూ సినిమాలకు కూడా బాలకృష్ణ ఇప్పటికే పచ్చజెండా ఊపారు. ఏదేమైనా, అన్నీ కుదిరి ‘ఎన్‌బీకే ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే అవకాశం ఉందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.