19 August, 2026 | 3:39 AM

కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి

19-08-2026 12:08 AM

అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నిరసన

సత్తుపల్లి. ఆగస్టు 18 (విజయ క్రాంతి): సత్తుపల్లి: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ మాజి ఎమ్మెల్యే సండ్ర వేంకట వీరయ్య ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లిలో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పేద కుటుంబాలకు అందుతున్న వివాహ ఆర్థిక సాయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

పథకాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి పథకం కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనసాగించరని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

రైతు బీమా ప్రీమియంను ప్రభుత్వం సక్రమంగా చెల్లించి అర్హులైన రైతు కుటుంబాలకు బీమా ప్రయోజనం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం కంటే సాగునీటి ప్రాజెక్టులను రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని అన్నారు. సీతారామ ప్రాజెక్టు, రాజీవ్ లింక్ కెనాల్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.  ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.