పూటకో లొల్లి!
హస్తం పార్టీలో అసంతృప్తి స్వరాలు
* వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి
* అదిలాబాద్‌లో మంత్రి జూపల్లి ఎదుటే రెండు వర్గాల మధ్య వాగ్వాదం
* తరచూ అసమ్మతి గళం వినిపిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
- కాంగ్రెస్‌లో ఓవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై వరుస సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్న సమయంలో.. మరోవైపు పలువురు నేతల అసమ్మతి, అసంతృప్తి స్వరాలు బయటికి వస్తున్నాయి. ఒక నియోజకవర్గంలోని సమస్యలు సమసిపోతాయని అనుకుంటున్న తరుణంలోనే.. మరో నియోజకవర్గంలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం.. గాంధీభవన్‌కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది.
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఇప్పుడు వనపర్తి వంతు.. నిన్న గాక మొన్న, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి రాజకీయాలపైన సంచలన కామెంట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. పార్టీ పెద్దలకు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని, నియోజకవర్గంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చిన్నారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఎనిమిదిసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డి.. పార్టీ టికెట్ కోసం ఎవరికి డబ్బులు ఇచ్చాడో చెప్పాలంటూ ప్రతి సవాల్ చేయడం కాంగ్రెస్‌లో మరో వివా దం మొదలైంది. ఇప్పుడు వీరి వివాదం కూడా గాంధీభవన్‌కు ఎక్కింది. ఇక అదిలాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మంత్రి జూపల్లి ఎదుటనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు, ఆయన ప్రత్యర్థివర్గం కొట్టుకునే స్థాయికి వెళ్లాయి.
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. పార్టీలో జెండాలు మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెడుతున్నారని, తమి ళనాడులాగా రాజకీయ పరిస్థితులు మారవచ్చంటూ చేసిన కామెంట్లు రాజకీయ పార్టీలో పెద్ద దుమారం లేపాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానం దృష్టికి చేరాయని టీపీసీసీ చీఫ్ మహేషకుమార్‌గౌడ్ ప్రకటించారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సమర్దించడాన్ని కూడా కాంగ్రెస్ వర్గాలు సీరియస్‌గానే పరిగణిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచు వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.
ఇదిలాఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించగా, ఆ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ సీఎం పర్యటకు దూరంగా ఉండటం చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల వల్లే మంత్రి సురేఖ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారనే చర్చ జరగుతోంది.
నియోజకవర్గాల్లోనూ..
కొన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు మధ్య గ్యాప్ ఉందని, వాటిపైన కూడా రాష్ట్ర నేతలు దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. తుంగతుర్తి, పాలకుర్తి, వనపర్తి, తాండూరు, జహీరాబాద్, చేవెళ్లతో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఇవి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, లోకల్ లీడర్లకు మధ్య సరైన సఖ్యత లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
తుంగతుర్తి వివాదం పెద్దది కావడంతో టీపీసీసీ పరిశీలకుడిని నియమించడం, ఆ వివాదంపైన నివేదిక కూడా టీపీసీసీకి అందింది. పార్టీ తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొన్నది. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలోని వివాదంపైన పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ జరుపుతోంది.
ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకు మధ్య విభేదాలు, వివాదాలు నెలకొన్న ప్రాంతాల్లో పరిష్కారానికి అధిష్ఠానం నుంచి అంతగా చర్యలు చేపట్టినట్లుగా కనిపించడం లేదని పార్టీవర్గాల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతల మధ్య నెలకొన్న పంచాయతీలతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారుతుందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.






