19 August, 2026 | 2:33 AM

నిషేధిత ఉచ్చులో సామాన్యుడి భూమి!

19-08-2026 01:14 AM
  1.    22 -ఏ గందరగోళంతో సర్కారుకు సెగ 
  2. రాష్ట్రంలో మొత్తం భూమి 2.20 కోట్ల ఎకరాలు
  3.    22-ఏ జాబితాలోకి 90-93 లక్షల ఎకరాలు?
  4. కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో 20 వేల దరఖాస్తులు
  5. వివాదంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలు
  6. అధికారుల యాంత్రిక వైఖరితో నిలిచిన రిజిస్ట్రేషన్లు
  7. విపక్షాలకు బలమైన రాజకీయ ఆయుధం

ఎ.చంద్రశేఖర్ రావు :

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 18 (విజయక్రాంతి): తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్టన్ 22-ఏ కింద రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం తయారు చేసిన సరికొత్త నిషేధిత ఆస్తుల జాబితా లక్షలాది మంది భూ యజమానుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో మొత్తం భూమి 2.20 కోట్ల ఎకరాలు ఉండగా.. 22-ఏ జాబితాలోకి 90-93 లక్షల ఎకరాలు చేరినట్టు తెలుస్తోంది.

కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో 20 వేల దరఖాస్తులు ఉన్నట్టు సమాచారం. బేస్ సర్వే నంబర్ల పొరపాట్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిన్నటివరకు ఎలాంటి వివాదం లేని సొంత పట్టా భూములు, హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాట్లు, చివరకు దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి ఎక్కడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇది కేవలం పరిపాలనా పరమైన లోపం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్న ప్రధాన రాజకీయ సంచలనంగా రూపాంతరం చెందుతోంది.

భూ రికార్డులను ధరణి పోర్టల్ నుంచి కొత్తగా భూ భారతి పోర్టల్‌కు అనుసంధానించే క్రమంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయ లోపం స్పష్టంగా బయటపడింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వివాదాస్పద భూములను వేరు చేయాల్సింది పోయి, ఒక సర్వే నంబరులో కేవలం రెండు మూడు ఎకరాల ప్రభుత్వ లేదా కోర్టు వివాదం ఉంటే.. ఆ సర్వే నంబర్ పరిధిలోని వందలాది ఎకరాల ప్రైవేటు భూమినంతటినీ అధికారులు యాంత్రికంగా నిషేధిత జాబితాలో చేర్చేశారు.

దీని ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల నుంచి మొదలుకొని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల వరకు తీవ్రంగా పడింది. అత్యవసర ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భూములు అమ్ముకుందామని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తున్న సా మాన్యులకు ’లిస్టులో మీ భూమి నిషేధించబడింది’ అనే బోర్డులు దర్శనమిస్తుండ టంతో జనం బెంబేలెత్తుతున్నారు. 

కుట్రనా? లేక వసూళ్ల కోణమా?

ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున ప్రభు త్వ కుట్ర దాగి ఉందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిని అడ్డుపెట్టుకుని విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అంతకంటే ఘోరమైన 22-ఏ ఉచ్చును బిగించిం దని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలనే ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలోకి నెట్టి, ఆ తర్వాత వాటిని తొలగించేందు కు (ఎన్వోసీల కోసం) కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వసూళ్లకు, సెటిల్మెంట్లకు తెరలేపారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.

మరోవైపు నమ్మి అడ్వాన్సులు ఇచ్చి న కొనుగోలుదారులు, బ్యాంకు లోన్లు మం జూరైన హోమ్ బైయర్స్ రిజిస్ట్రేషన్లు కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటోం దని, ఖజానాకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ

ప్రజల నుంచి, విపక్షాల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా స్పందిస్తూ, ఒక సర్వే నంబరులో కోర్టు వివాదం ఉంటే మొత్తం భూమిని బ్లాక్ చేయడం తప్పే. ఆ వివాదాస్పద భూమిని మినహాయించి, మిగిలిన ప్రైవేటు భూములకు సబ్-నెంబర్లు ఇచ్చి తక్షణమే రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తాం. సామాన్యుల భూమి ఒక్క ఇంచు కూడా పోదు, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు‘ అని భరోసా ఇచ్చారు. 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష జరిపి ఇప్పటికే పెండింగులో ఉన్న 20 వేల దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రకటించినప్పటికీ, కిందిస్థాయి రెవెన్యూ కార్యాలయా ల్లో ఫైళ్లు కదలడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభు త్వం యుద్ధప్రాతిపదికన ఈ 93 లక్షల ఎకరాల నిషేధిత గందరగోళాన్ని చక్కదిద్దక పోతే.. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెను ముప్పుగా మార డం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మెదక్ జిల్లాలో 1.5 లక్షల ఎకరాల భూమి లాక్

ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 1.5 లక్షల ఎకరాల భూమి 22-ఏ నిషేధిత జాబితాలో లాక్ అయిపోయింది. ఇది జిల్లా మొత్తం రికార్డెడ్ భూమి విస్తీర్ణంలో 16.5 శాతం కావడం గమనార్హం. సిద్దిపే ట, మెదక్ జిల్లాలో కలిపి 1.10 లక్షల నుండి 1.25 లక్షల ఎకరాల ప్రైవేట్, అసైన్డ్, ప్రభుత్వ భూములు నిషేధిత ఉచ్చులో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు కలెక్టరేట్ల పరిధిలో కేవలం ఈ 22-ఏ పరిధి నుంచి ప్రైవేటు భూములను తొలగించాలంటూ 3,500 కంటే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 22-ఏ భూములు లాక్ అయిన టాప్-10 మండలాల్లో సంగారెడ్డి జిల్లాలోని మండలాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇందులో రామచంద్రాపురం మండలంలో రికార్డెడ్ భూమిలో అత్యధికంగా 53.7 శాతం భూమి 22-ఏ కింద రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిచిపోయింది. అమీన్పూర్ మండలంలో 43.6 శాతం భూమి నిషేధిత జాబితాలోకి వెళ్ళింది. పటాన్చెరు పారిశ్రామిక, నివాస ప్రాంతంగా ఉన్న ఇక్కడ 34.3 శాతం భూమి లాక్ చేయబడిందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రతిపక్షాలకు దొరికిన బ్రహ్మాస్త్రం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ వెనుకబడిందంటూ ఇప్పటికే దాడి చేస్తు న్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ఈ 22-ఏ భూముల వ్యవహారం ఒక తిరుగులేని రాజకీయ ఆయుధంగా మారింది. ప్రజల నిత్యజీవితంలో అత్యంత సున్నితమైన, కీలకమైన భూమి హక్కు సమస్య కావడం వల్ల దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజా కోర్టుల్లో కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసేందుకు ఇది సరైన అస్త్రమని భావిస్తూ.. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తహసీల్దార్ ఆఫీసుల ముట్టడికి ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.