19 August, 2026 | 2:54 AM

ప్రతి చుక్కకూ లెక్కే

19-08-2026 01:02 AM
  1. ఎల్ నినో వేళ నీటి వినియోగంలో అప్రమత్తత
  2. తాగునీటికే తొలి ప్రాధాన్యం.. పంటలకూ భరోసా 
  3. వాస్తవ నిల్వలు, ప్రవాహాల ఆధారంగానే నీటి విడుదల
  4. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
  5. జలాశయాల్లో నీటి మట్టాలు, ప్రవాహాలపై సమీక్ష

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : ఆకాశం వైపు ఆశగా చూడటం కంటే జలాశయాల్లో వాస్తవిక  నిల్వలు, ప్రవాహాలు, వినియోగానికి అందుబాటులో ఉన్న నీటిపై స్పష్టమైన లెక్కలతోనే జల నిర్వహణ  చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున ప్రతి నీటి చుక్కనూ ఆచితూచి వినియోగించాలని అధికారులకు సూచించారు.

తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తూనే, అందుబాటులో ఉన్న నీటితో వానాకాలం పంటలకు భరోసా కల్పించేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు. మంగళవారం జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన వానాకాలం సీజన్‌కు సాగునీటి అవకాశాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి పెద్ద ఎత్తున ప్రవాహాలు ఉంటాయని ముందుగానే ఊహించుకొని ప్రణాళికలు రూపొందించవద్దన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న నీరే ప్రామాణికంగా నిర్ణయాలు ఉండాలన్నారు.  

రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియజేయండి

రైతులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలియజేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్  ఆదేశించారు. జలాశయాల్లోని స్థూల నిల్వ శాతాలను మాత్రమే చూపించి పరిస్థితి ఆశాజనకంగా ఉందన్న భావన కలిగించవద్దని హెచ్చరించారు. కాగా కృష్ణా బేసిన్‌లోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 973.68 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 746.12 టీఎంసీల నీరు ఉండి, 76.63 శాతం నిల్వలు నమోదయ్యాయని అధికారులకు మంత్రికి వివరించారు.

అదే విధంగా గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి 208.38 టీఎంసీలు, అంటే 68.1 శాతం నీరు అందుబాటులో ఉందని తెలిపారు. నాగార్జునసాగర్‌లో సుమారు 164 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. మంత్రి స్పందిస్తూ..  నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలను జాగ్రత్తగా అంచనా వేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మిగిలిన వానాకాలం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని.. 2025, 2026 సంవత్సరాల్లోని నిల్వలు, ప్రవాహాలను అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.   

నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి

వైరా రిజర్వాయర్‌పై మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి జలాలతో తిరిగి నింపుకునే అవకాశం ఉన్నప్పుడు సాగునీటి విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు.   దేవాదుల, నిజాంసాగర్, స్వర్ణ, సదర్మట్ ఆనకట్ట, రామడుగు, బుగ్గలవాగు, రామపల్లి, పాలెంవాగు, గౌరవవరం, పోచారం, రాజీవ్ సాగర్, నెలవాయి, వట్టివాగు, నల్లవాగు, పాల్వాయి పురుషోత్తంరావు (ఎర్రవాగు), చెల్మెలవాగు (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నిల్వల ప్రామాణికంగా పంటలకు నీటిని విడుడల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మూసీ జలాలను కూడా సమర్థంగా వినియోగించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, సింగూరు సహా గోదావరి బేసిన్లలోని ఇతర ప్రధాన జలాశయాల పరిస్థితిని  మంత్రి సమీక్షించారు.

సింగూరు ప్రాజెక్టు భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, పటిష్టీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగం పనుల పురోగతిని కూడా సమీక్షించిన మంత్రి..భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు.