19 August, 2026 | 2:00 AM

ఇది రాక్షస రాజ్యం!

19-08-2026 12:57 AM
  1.    30వేల ఎకరాలు రేవంత్ ప్రభుత్వం లాక్కుంది
  2. సీఎం, మంత్రుల కుటుంబాల జులుం
  3. టీఆర్‌ఎస్ చీఫ్ కవిత విమర్శలు

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం (ఆర్‌ఆర్‌ఆర్) నడుస్తున్నదని, సీఎం కుటుంబమే భూ దోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. పేదలకు భూములు పంచాల్సిన ప్రభుత్వమే పరిశ్రమల పేరుతో లాక్కుంటున్నదని మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల నుంచి 30 వేల ఎకరాలు గుంజుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పీవీ నరసింహారావు, నిజాం లాంటి వాళ్లు పేదలకు భూములు ఇచ్చారని వాటికి యాజమాన్య హక్కులు ఇస్తామని ఎన్నికల సందర్భంలో మాటఇచ్చి ఇప్పుడు వాటిని లాక్కుంటారా అని మండిపడ్డారు. పేదల భూములు గుంజుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సీఎం కుటుంబం, సోదరులు, శ్రీధర్‌బాబు సోదరుడు, భట్టి కుటుంబం, పొంగులేటి కుమారుడు ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 22 ఏ పేరుతో భూ దోపిడీకి రాచమార్గం ఏర్పాటుచేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల 6న తాము చేపట్టిన సామాజిక సంకల్ప సభ కారణంగానే సీఎం నోట సామాజిక న్యాయం అనే మాట వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలకు ఒకలా, ఇతరులకు మరోలా న్యాయం జరుగుతుందని ఆరోపించారు.

విజయశాంతికి అన్యాయం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ తరఫున భూ లక్ష్మి పథ కాన్ని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 60 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. భూదాన్ భూముల లెక్కలు ఎక్కడని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే పేదలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు ప్రతీ కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని కవిత స్పష్టంచేశారు.