ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువత మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఏజెన్సీ DSC సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ మంద మకరందు, మర్యాదపూర్వకంగా ఐటీడీఏ కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా CRT ,ఇతర ఉద్యోగ నియామకాలలో ఎటువంటి అక్రమాలు జరగకుండా పూర్తి మెరిట్ ఆధారంగా పారదర్శక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన అక్రమ CRT నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అర్హత లేని వారిని తొలగించి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు మరియు గురుకుల విద్యాసంస్థల్లో ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు సీట్ల సంఖ్య పెంచి నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. RJC సీట్లు తగ్గిపోవడంతో ఆదివాసీ గిరిజన విద్యార్థులు విద్యావకాశాలు కోల్పోతున్నారని, అందుకు ప్రత్యామ్నాయంగా గురుకులాల్లో
అదనంగా 300 సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేసి స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఐటిడిఏ పరిధిలోని 29 శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ DSC సాధన కమిటీ అధ్యక్షుడు పేందుర్ దీపక్, ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్, కార్యదర్శి మడవి మనోహర్, కోశాధికారి మెస్రం కృష్ణకాంత్, మోతీరం, సహాయక కార్యదర్శి గంగారాం, జాధవ్ వివేక్, గోవింద్ రావ్, కొమరం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి మధురాజ్, కుర్సెంగా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






