నాలుగు లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలి
మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయలేమంటూ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, కార్మికుల హక్కులకు తీవ్ర నష్టకరమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పర్వత కోటేష్, హలవత్ లింగన్న, ఏపూరి వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కార్మిక చట్టాలలో 29 రకాల కార్మిక చట్టాలను క్రోడీకరించి రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లు అమల్లో వస్తే గత చట్టాలలో ఉన్న అర కోర కార్మిక ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకుండా పోతాయన్నారు.
కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు భూక్య రాము, తేజావత్ శోభన్, పులిగిల్ల మల్లయ్య, అల్లి ఏకాంబరం, పట్టాభి మల్లేశం, సురేష్, లింగన్న, జయశంకర్, గోపి, కళ్యాణ్ పాల్గొన్నారు.




