అచెం‘చలం’
గుడిపాటి చలం తెలుగు సాహిత్య రంగంలో తిరుగులేని రచయిత. కానీ, ఆ మాట ఆయనతో ఎవరైనా అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు. తానేదో తనకు తోచింది రాసుకుంటూ వెళ్లానని చెప్పేవాడు. ఒక కోయిల కూసినట్లు, ఒక కాకి అరిచినంత సులభంగా తన రచనలు సాగాయని చెప్తాడు. మంచో చెడో తనకు నిజాయితీగా అనిపించిన, స్ఫురించిన సామాజిక అంశాలపై రచనలు చేశానని ప్రకటించుకునేందుకు ఇష్టపడేవాడు. మిగతా కవులకు ఈయనకు ప్రాథమికమైన తేడా ఏమిటంటే.. నాటి ప్రముఖ కవులంతా తమను తాము గొప్ప కవులమంటూ చెప్పుకొనేవారు. ఇంకొందరైతే తాము కవిత్వాన్ని శాసిస్తున్నామని, తమ రచనల ద్వారా తెలుగు సాహిత్య రంగాన్ని నడిపిస్తున్నామని ప్రకటించుకునేవారు.
అయితే.. వారి వ్యాఖ్యలపై అనేక విమర్శలున్నాయి. వారిది ఆత్మవిశ్వాసమని కొందరు వాదించేవారు. ‘కాదు.. కాదు.. వారిది ముమ్మాటికీ అహంకారమే’ అని ఈసడించుకున్న వారూ కొందరునున్నారు. కానీ, చలం విషయంలో అలా జరగలేదు. చలం ఏ నాడూ తానొక గొప్ప రచయితనని చెప్పుకోలేదు. విమర్శకులు, పాఠకులు తనను తిట్టినా, తెగిడినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలూ లేవు. కథలు, నవలు, కవితలు.. ప్రక్రియ ఏదైనా సరే ఆయన రచనల్లో విలక్షణమైన శైలి ఉండేది.
ఆ విలక్షణత ఏమిటని ఇతమిత్థంగా చెప్పలేం. ఎంతో విశాలమైన ఆలోచనా దృక్పథం ఉంటే తప్ప ఆయన రచనల్లోని లోతైన భావాలు అర్థం కావు. ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛపై ఆయన రాసినన్ని రచనలు తెలుగు సాహిత్య రంగంలో మరే ఇతర రచయితలూ రాయలేదంటే అతిశయోక్తి కాదు. చలం అంటే స్వేచ్ఛ, చలం అంటే సౌందర్యం, చలం అంటే ప్రేమ, చలం అంటే ఆనందం. ఆయన ఏది నమ్మాడో అదే రాశాడు, ఏది రాశాడో దాన్నే ఆచరించాడు.
మాటలకు, చేతలకు మధ్య తేడా లేని అరుదైన వ్యక్తిత్వం ఆయనది. స్త్రీవాద కోణంలో చూసినప్పుడు చలం ఆలోచనలు నేటి తరానికి మరింత దగ్గరగా ఉంటాయి. సమాజంలోని ద్వంద్వ నీతిని ఆయన తీవ్రంగా నిరసించారు. మగవాడికి ఒక న్యాయం, ఆడదానికి మరొక న్యాయం ఉండే పద్ధతిని తీవ్రంగా తప్పుబట్టారు. అందుకు ఆయన ‘మైదానం’ నవలే ఉదాహరణ. చలం రచనల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమ చాలా సహజంగా ఉంటుంది. భావ కవుల లాగా ఆయన శరీరాల్లేని ఊహాత్మక ప్రేమను ప్రతిపాదించలేదు. శారీరక కాంక్షతో కూడిన వాస్తవిక ప్రేమను తన రచనల్లో ఆవిష్కరించాడు. మానసిక సంఘర్షణలను నిస్సంకోచంగా చర్చించాడు.
ఆయన రచనల్లో ఆ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. చలం అనువాద రచనల్లో పర్షియన్ కవి ఉమర్ ఖయ్యాం ‘రుబాయీలు’ ప్రసిద్ధం. భౌతిక ఆనందాల వెనుక ఉండే వేదాంతాన్ని ఉమర్ ఖయ్యాం పర్షియన్ భాషలో పలికించిన భావాలను, చలం అలవోకగా తెలుగులోకి అనువదించాడు. ‘చెట్టు నీడలో కూచున్న మనకేం కావాలి? ఓ రొట్టె, ఓ కావ్యం, మధువు, నా పక్కన కూచుని నువ్వు పాడుతో. ఏడారి స్వర్గమవుతుంది’ అని అచ్చమైన తెలుగు కవితలా రాశాడు.
రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిఖ్యాత రచన ‘గీతాంజలి’నీ చలం తెలుగులోకి తెచ్చాడు. బెంగాలీ మూలానికి, ఆంగ్ల అనువాదానికి ఏమాత్రం తీసిపోకుండా కవితలను తీర్చిదిద్దాడు. ‘నా హృదయేశ్వరా! నీ రాక కోసం నా ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి’ అనే ఆధ్యాత్మిక చింతనను సున్నితంగా ఆవిష్కరించాడు. ఠాగూర్ భావాలను తనదైన శైలిలో భక్తి, ప్రణయాల మేళవింపుగా రాశాడు. చలం రచనల్లో మరో అపురూపమైన రచన ‘మ్యూజింగ్స్’. దశాబ్దాల క్రితం రాసిన ఈ మ్యూజింగ్స్ పుస్తకం నేటి పాఠకులనూ ఆకట్టుకుంటున్నది.
మనిషి లోపలి అంతరంగ సంఘర్షణలు, సమాజంలోని కపటత్వాన్ని వ్యాసాల్లో చలం నిష్కర్షగా చర్చించాడు. రచనలో మనిషి చుట్టూ సమాజం నిర్మించిన కృత్రిమ బంధాలు, అలిఖిత నియమాలను ఆయన తీవ్రంగా నిరసించాడు. ‘సమాజం కోసం నిన్ను నువ్వు చంపుకోకు’ అనే సందేశం దీనిలో బలంగా కనిపిస్తుంది. ఇది పాత తరం పుస్తకం కాదు. అది నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి. ప్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మనిషి సొంత ఆనందాలను పక్కనపెడుతున్నాడు. ఇలాంటి సమయంలో మ్యూజింగ్స్ చదివి, తమ జీవితంలో చిన్న చిన్న ఆనందాలైనా పొందవచ్చని ఎంతో మంది ప్రముఖులు గతంలో చెప్పి ఉన్నారు.
సమాజంలో నిజాయితీగా, సంకెళ్లు లేకుండా బతకాలనుకునే ప్రతి ఆధునిక వ్యక్తికి మ్యూజింగ్స్ ఒక ఆదర్శమని చెప్పవచ్చు. సమాజంలో రచయితలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యవస్థను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే వారు ఒక వర్గం అయితే, ప్రతి దాన్ని ప్రశ్నించే వారు రెండో వర్గం. చలం రెండో వర్గానికి చెందిన రచయిత అని రూఢీగా చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ సంప్రదాయ వ్యవస్థను ఆమోదించలేదు. ఆయన తిరుగుబాటు స్వభావం గల రచయిత. జీవితం ఇలాగే ఎందుకు ఉండాలని నిరంతరం తన రచనల ద్వారా ప్రశ్నలు వేశాడు. కుటుంబ జీవితాన్ని, సామాజిక ఆచారాలను నిష్కర్షగా పరిశీలించారు. చలం పుస్తకాలు చదివితే మనుషుల్లోని కపటత్వం, మొహమాటాలన్నీ బయటపడతాయి. మూఢ విశ్వాసాలన్నీ పటాపంచలవుతాయి.
ఖుషిత






