18 May, 2026 | 12:57 AM

‘మహాశిల్పి జక్కన’ బహు చక్కన

18-05-2026 12:00 AM

కవి దాశరథి కృష్ణమాచార్యులు పేరు వినగానే పాఠకులకు ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘గాలిబ్ గీతాలు’ గుర్తుకువస్తాయి. నైజాం రాచరిక వ్యతిరేక పోరాటంలో సింహం లా గర్జిస్తూ రాసిన - ‘తీగలను తెంపి అగ్నిలో దింపి నారు / నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే పద్య పంక్తులూ, ‘నా రక్తం పారబోసి నిలిపినానీ / నా వెంట్రుకలు గెలవలేవు’ , ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో’ - పాటలు అప్రయత్నంగా గుర్తుకొస్తాయి.

ఎనిమిదేళ్ల చిరుప్రాయంలోనే ప్రారంభమైన తన సాహిత్య ప్రస్థానం యాభై ఏళ్ల (1937- పాటు దిగ్విజయంగా సాగింది. కవిగా, గీత రచయితగా, అభ్యుదయ కవిగా రాసిన పద్య గేయ కావ్యాలు, బాల గేయాలు, లలిత గీతాలు, కథలు, నాటకాలు, నాటికలు, అనువాదాలు, వ్యాసాది ప్రక్రియల్లో ఆయన వైవిధ్య రచనలు అనేకం ఉన్నాయి. అయితే.. 1964 లో దాశరథి ‘మహాశిల్పి జక్కన’ అనే చారిత్రాత్మక నవలను రచించారనే సంగతి చాలామందికి తెలియదు.

దాశరథి తన ‘అగ్నిధార’ (1949) కవితా సంపుటిలో ‘శిల్పి’ అనే పద్య కవితలో ‘నీ ఊపిరి చూచి ప్రస్తరము శిలయై పోయెను  నీ మునికోలందలన్ని రమణీయ రూపాలీశ్వర, కాల మోహన ఫలితమ్ములై, భృకుటులై, కుటిలాలక జాలమై, సురాంగనలయి రూపూది నీ కావ్య గీతాలలో అమత ము చల్లి జీవనములు పోసినాయే దేవు! బ్రహ్మవు, శిల్పి కులవతంసమా!’ అని శిల్పిని కీర్తించారు. 1964లో విడుదలైన ‘అమరశిల్పి జక్కన’ చిత్రంలోనూ ‘శిలలను కరిగించు నీవు శిలవై అయిపోయావా, వెన్నెలలతో విందు చేయు పున్నమి చంద్రుడవు నీవు - కళ్లు మూసి, కాంతి బాసి గ్రహణం పాలైనావా’ అంటూ జక్కన ఒంటరి విషాద పరిస్థితిని హృద్యంగా వర్ణించారు. అసలేవరీ జక్కన.. అని పరిశోధిస్తే ఆయన క్రీస్తుశకం 12 వ శతాబ్దానికి చెందినవాడని తేలింది.

జక్కన స్వస్థలం కర్ణాటకలోని తుమకూరు పట్టణానికి తొమ్మి ది మైళ్ల దూరంలోని కైదాల (దీని పూర్వనా మం క్రీడాపురం). ఆ కాలంలో జక్కన చేయితిరిగిన శిల్పిగా జగత్ప్రసిద్ధిగాంచారు. కల్యాణీ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలకు శిల్పాచార్యుడు జక్కనయే. బేలూరు, హళేబీడు, కైదాల లోనూ ఉన్న చెన్నకేశవాలయాలు జక్క న గొప్ప శిల్పనైపుణ్యానికి తార్కాణాలు. ‘తేనె సౌందర్యములను రాతియందు తెప్పించగలవాడు శిల్పి. తన కళాశక్తితో రాళ్లను సుందర శిల్పములుగా మలచగలవాడు. ఆ శిల్పి గతించును గాని, యాతడు సృష్టించిన శిల్పములు శత శతాబ్దములు నిలువగలవు’ అంటూ మొదలవుతుంది దాశరథి నవల.

పన్నెండవ శతాబ్ది ప్రారంభంలో మైసూరు (కర్ణాటక) లో విష్ణువర్ధన దేవుడనే చక్రవర్తి పరిపాలన సాగుతున్న కాలంలో తుమకూరు పట్టణ సమీపం లోని క్రీడాపురం అనే గ్రామంలో శిల్పి మల్లన నివసిస్తుండేవాడు. అతడి కొడుకే జక్కన. మల్లన గండశిలను చెక్కుతున్నప్పుడు రెండు రాతిముక్కలు ఎగిరివచ్చి అతడి కళ్లకు తగల గా అంధుడయ్యాడు. అప్పటి నుంచి అతడు పదహారేళ్ల కొడుకు జక్కన ఇంట్లోనే పాలరాతితో అందమైన బొమ్మలను చెక్కి, చుట్టుపక్క ల గ్రామాల్లో విక్రయించి తాను, తండ్రీ జీవిస్తుండేవారు. ఒకరోజు జక్కన పాలరాతితో రెండు చిన్న విగ్రహాలను సుందరంగా చెక్కి, సాయంత్రం జైనసౌధ పరిసరాల్లో ఉన్న రంగరాజమ్మ ప్రేరణలో పెరిగిన బాల నర్తకీ మల్లిక స్నేహసౌధానికి వెళ్లాడు.

మల్లిక తాను చేసే నృత్యమును ఆపి జక్కనాచార్యుల చేతిలోని విగ్రహ బొమ్మలను చూసి ముగ్ధురాలై కానీ ‘పాలరాతి విగ్రహాలు గాక గండశిలలతో చెక్కగలిగిన సంతోషింతును’ అంటుంది. ఆమె మాటలతో ప్రభావితుడై జక్కన మర్నాడే తండ్రికి తెలియకుండా అడవికి తొలినసారిగా వెళ్లి గండశిలలతో చెక్కిన విగ్రహాలను తెచ్చి ఆమెకు ఇస్తాడు. తర్వాత తన మనసులో ముద్రవేసిన మల్లిక రూపరేఖలతో ఆమె విగ్రహాన్ని చెక్కుతుంటాడు. 

చిగురించెను ప్రేమ

రంగరాజమ్మ తమ్ముడైన బసవన్నతో కలి సి అడవికి విహారానికి వచ్చిన మల్లిక ఊయలలో చెక్కుతున్న జక్కననూ, తనను పోలి ఉన్న విగ్రహాన్ని చూస్తుంది. అప్పుడే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ బహిర్గతమవుతుంది. ఈ విషయాన్ని బసవన్న తన అక్క రంగరాజమ్మతో చెప్పగా ఆమె మల్లికను బయటకు వెళ్లనీయకుండా బంధిస్తుంది. అర్ధరాత్రి మల్లి క తప్పించుకుని జక్కన ఇంటికి చేరగా, మల్లన తన కొడుకు జక్కనకూ, మల్లికకూ వేణుగోపాలస్వామి సన్నిధిలో పెండ్లి జరిపిస్తాడు.

ఆ ప్రాంతాన్ని భోగలాలసుడూ, పానగాన ప్రియుడూ, వ్యసనాలపాలైన గూళిదేవుడనే సామంతరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు పరివార సమేతంగా అరణ్యం నుంచి వెళ్తుంటే- జక్కన చెక్కిన సుందర శిలావిగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని భటులతో తన రాజభ వన ప్రాంగణానికి తరలిస్తాడు. అందమైన విగ్రహానికి స్ఫూర్తి అయిన సుందరి గురించి ఆరా తీయించగా, రంగరాజమ్మ ద్వారా జక్క న, మల్లిక వివరాలు తెలుసుకుంటాడు. తన సేనాపతి ద్వారా జక్కనను పిలిపించుకుని తన ఆరామంలో వసంతమండపాన్ని నిర్మించాలనుకుంటున్నానని, దాని నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నానని, తన ఆస్థాన శిల్పిబిరుదాంకితుడిగా నియమిస్తున్నానని చెబుతాడు. జక్కనకూ, మల్లికకూ అక్కడే నివాసం కల్పిస్తాడు. 

సామంతరాజు వంచన

కొద్దిరోజులకు నల్లరాయి అయిపోగా దూర ప్రాంతం నుంచి తెచ్చేందుకు సకల సౌకర్యాలు కల్పించి గూళి దేవరాజు - జక్కన ను పంపిస్తాడు. ఒంటరిగా ఉన్న మల్లికపై బలాత్కార ప్రయత్నం చేస్తాడు. ఆమె తప్పించుకుని పరుగెత్తగా ఆమెను బంధించి చెర సాలలో వేస్తాడు. కొందరి సహాయంతో చెరసాల నుంచి బయటపడి అడవుల్లో భర్త జక్క న కోసం వెతుకుతూ ఎదురుగా వస్తున్న బండ్లలో భర్త ఉన్నాడని పరుగెత్తుతూ వస్తూ, ప్రమాదవశాత్తూ కొండపై నుంచి కింది లోయలో పడిపోతుంది. నిజంగానే ఆ బండ్ల లో ప్రయాణిస్తూ వస్తున్న జక్కన ఎవరో స్త్రీ అని తెల్సుకోబోగా, ఆమె ప్రవాహంలో కొట్టుకుని పోతుంది. తనకు దొరికిన వస్త్రం మల్లిక దేనని గుర్తించి, భార్య మరణించిందని, నిరాశలో మునిగి గూళి దేవరాజు చేసిన మోసాన్ని అన్యాయాన్ని తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లిపోదామని తిరిగి పోతుంటాడు.

తండ్రి మల్లన ఈ విషాద పరిణామాలను తెలుసుకొని, కొడుకు జక్కనను తలుసుకుని ఇల్లాలు చనిపోయినందుకు బాధపడతాడు. మనశ్శాంతి కోసం మల్లన, జక్కన దేశాటనకు బయలుదేరుతారు. ఎల్లోరాకు వెళతారు. ఇక్కడ బౌద్ధ, జైన, హైందవ సంప్రదాయ శా పద్ధతుల ప్రకారం చెక్కిన పద్మహస్త గుహలను దాశరథి కవిత్వలయలో వర్ణిస్తారు. ఇది చైత్యశాల, ఇది విహారము, ఈ గుహల్లో ఈ శిల్పాలున్నాయంటూ కళ్లకు కట్టినట్లుగా వివరించారు. కైలాసనాథాలయాన్ని కొండపై నుంచి కిందకి చెక్కిన శిల్పుల అద్భుత చాతుర్యాన్ని ప్రశంసించాడు. తర్వాత శిల్పానికీ, చిత్రలేఖనానికీ ప్రసిద్ధమైన అజంతా గుహలకు తండ్రీ కొడుకులు వెళ్తారు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండల్లో గుహలుగా తొలచి శిల్పులూ, చిత్రకారులూ జక్కన వేసిన చిత్రాలేఖనాలను దాశరథి వివరించాడు.

ముఖ్య గుహల్లో ఉన్న బోధిసత్త్వ పద్మపాణి, శిబి చక్రవర్తి క్షీరధారల కథలను వివరించే విగ్రహాలనూ, చిత్రలేఖనాలను గుహా విస్తీర్ణాలతో పాటుగా అత్యద్భు తంగా దాశరథి వర్ణించాడు. ఆ తరువాత మల్లన, జక్కన ఇంటికి చేరుకుంటారు. జక్కన భార్య మల్లిక నదిలో కొట్టుకుపోతుంటే నదిని దాటుతున్న వేటగాళ్లు ఆమెను రక్షిస్తారు. వారి నాయకుడైన శైవనాయకుడు మల్లికను సొంత కూతురు కన్నా ప్రేమగా చూసుకుంటుంటా డు. గర్భవతిగా ఉన్న మల్లిక నెలలు నిండిన తర్వాత కొడుకును ప్రసవిస్తుంది. ఆ కొడుకు కు ఢంకన అని నామకరణం చేస్తారు. ఆ ఢంక న ఇలువిద్యతో పాటు, స్వయంకషితో శిల్పవిద్యనూ నేరుస్తాడు. తరుణ వయస్కుడైన తరు వాత ఢంకన తండ్రిని వెతికేందుకు బయలుదేరుతాడు. ఇక్కడ మల్లన, జక్కన ప్రతిదినం ఒక్కో గ్రామానికి వెళ్లేవారు.

ఒక రోజు మల్లన తన కనులలో ద్యోతకమైన వెలుగును ఒక రూపముగా శిల్పంగా చెక్కాలనుకుని ముండి త శిరస్కుడూ, త్రిదండధారీ, తులసిమాలాలంకతమైన ఒక విగ్రహాన్ని చెక్కినాడు. ఆ మా ర్గంలో కొందరు రామానుజులవారి శిష్యులు వెళ్తూ ఆ విగ్రహానికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఆ విగ్రహం శ్రీమద్రామానుజుల వారిదని జక్కనకు చెప్పి రామానుజులవారు మేలుకోటలో ఉన్నారని చెబుతారు. ఆ శిల్పా న్ని - భగవద్రామానుజులకు అందించి ఆశీస్సు ల నొందే తలంపుతో మల్లనా జక్కనా బయల్దేరుతారు. కానీ, మార్గమధ్యంలోనే మల్లన మరణిస్తాడు. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి మల్ల న అందుడని తెలిసి, అతడి మరణానికి రామానుజులవారూ చింతిస్తారు.

కుడిచేయి నరుక్కుని

బేలూరులో చెన్నకేశవాలయాన్ని నిర్మించేందుకు తగిన శిల్పి దొరికిండని శ్రీ రామాను జులవారు విష్ణువర్ధన మహారాజు దగ్గరకు జక్కనను పంపిస్తారు. జక్కన నేతత్వంలో ఆలయనిర్మాణ పనులు ప్రారంభమవుతాయి, చురుగ్గా సాగుతుంటాయి. త్రయో దశి రాగా భగవద్రామానుజులవారు మేలుకోట నుంచి బేలూరుకు రాగా - చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరుగుతుంది. తండ్రిని వెదుకుతూ బయల్దేరిన ఢంకన అక్కడికి చేరుకుంటాడు. అదే రోజు ఆ ప్రాంతంలోని విష్ణువర్ధన మహారాజు భార్య శాంతలాదేవి మాత చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠింపవలసి ఉంటుంది. హోమం జరుగుతుండగా, అక్కడే ఉన్న ఢంకనకు చెన్నకేశవస్వామిని చెక్కిన రాయిలో దోషం స్ఫురించెను. ప్రతిష్ఠ జరుగబోతుండగా వారించి ఆ విగ్రహంలో దోషం ఉందని చెప్పెను.

దోషం చూపిస్తే తన కుడిచేయిని నరుక్కుం--టానని శపథం చేసెను. ఢంక న ఉలి పట్టుకుని విగ్రహం నాభిపై కొట్టగా పెచ్చు ఊడి నీరు బొటబొటమంటూ కారి అందులో నుంచి కప్ప బయటపడెను. వెంటనే జక్కన తన కుడిచేయిని నరుక్కునెను. ‘జక్కనాచార్యా! అట్లేల చేసితివి’ అని శిష్యులు ప్రశ్నించగా, అతడే తన తండ్రియని తెలుసుకు ని ఢంకన ‘నాయనా!’ అని తండ్రిపై పడి కన్నీళ్లుపెట్టుకున్నాడు. జక్కన - ఢంకన తన కుమారుడని తెలిసి కౌగిలించుకుని ముద్దాడా డు. తన తండ్రి చేయి మళ్లీ వచ్చేటట్టు చేయమని ఢంకన రామానుజుల వారిని ప్రార్థించాడు. అప్పుడు రామానుజుల వారు ‘మీ క్రీడాపురంలో చెన్నకేశవాలయాన్ని నిర్మిం చిన స్వామి మరల చేయిని ప్రసాదిస్తాడు’ అని చెబుతాడు.

క్రీడాపురంలో జక్కన కొడు కు ఢంకనతో శిలను పరిశోధించి చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని చెక్కడానికి చేయి ఎత్తగా ఆశ్చర్యంగా కుడిచేయి వస్తుంది. (అందుకే క్రీడాపురానికి ‘కైదాల’ అని పేరు వచ్చింది. కన్నడంలో ‘కై’ అంటే చేయి. తెలుగులోనూ ‘కైదండ’, “కైకిలి” వంటి పదాల్లో “కై” ఉంది). ఆలయ నిర్మాణమూ పూర్తవుతుంది. రాణి శాంతలాదేవి చేతుల మీదుగా కైదాలలోని చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగు తుంది. తరువాత విష్ణువర్ధనమహారాజు- జక్కనను కుటుంబ సమేతంగా ఆహ్వానించి బేలూరులో ఆ మహాశిల్పి జక్కనకు కనకాభి షేకం చేస్తాడు. 

‘మహాశిల్పి జక్కన నిర్మించిన బేలూరు దేవాలయం నేడు యావద్భారత జనులకే కాక, ప్రపంచమందలి శిల్పకళాభి మానుల కెల్లరకు యాత్రాస్థలం’ అంటూ- పన్నెండవ శతాబ్దమున నిర్మించిన దేవాల యము నేటికీ చెక్కుచెదరని సౌందర్యాన్ని వెదజల్లుచున్నది. ఈనాడు విష్ణువర్ధన మహా రాజు లేడు, శాంతలాదేవి లేదు, మహాశిల్పి జక్కనా లేడు, భగవద్రామానుజులు లేరు, కానీ  దేవాలయ శిల్పసౌందర్యమున్నది.

కుల, మత, వర్గ, జాతి దేశ భాషాభేదాలు లేక అఖి ల మానవులకు దర్శనీయమైన ఆ శిల్పాన్ని చూసి తీరవ ల్సిందే. ధన్యత గాంచవలెను. శిల్పి హద యము ఆ దేవాలయమున అణువ ణువున ద్యోతకమగును. ఆ మహాశిల్పి జక్కన శిల్ప ముజరామరమై విలసిల్లు గాక.’ అని దాశరథి ఈ ‘మహాశిల్పి జక్కన’ నవలను ముగిస్తారు. సహజమైన వస్తుతత్వ పరిమళ శైలిలో కవి రాసిన చారిత్రక నవల పాఠకులను చదివిస్తుంది.