18 May, 2026 | 12:57 AM

శ్రమైక జీవన సౌందర్య గీతిక

18-05-2026 12:00 AM

‘నేను రాస్తా... నిరంతరం రాస్తా. విశ్రాంతి తీసుకోవాలనే కోరిక నాకు లేదు. సమాజ అభివృద్ధి కోసం, అకృత్యాలకు వ్యతిరేకంగా, నా కళ్లతో చూసి గ్రహించిన సత్యాన్ని రాస్తా. మానవీయ విలువలు పరిమళించాలని, మనిషిగా నా బాధ్యతను నెరవేరుస్తూ విశ్రమించకుండా రాస్తా’ అంటూ పాఠకులను తన అక్షర ప్రయాణంలో భాగస్వాములను చేసే సహజ కవి బిల్ల మహేందర్. ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కవి. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ‘నేను ఎలా జీవిస్తానో అలా రాస్తాను, ఎలా రాస్తానో అలానే జీవిస్తాను’ అని తన జీవితానికి, కవిత్వానికి నిఖార్సైన నిర్వచనం ఇచ్చుకున్న ఈ కవి తాజాగా వెలువరించిన కవితా సంపుటి ‘నేను మరణిస్తూనే ఉన్నాను’.

సాధారణంగా కవి, రచయిత ఎవరైనా ‘మరణం’ అనే పదాన్ని అశుభంగా భావించి, ఎవరూ ఒక పుస్తకానికి శీర్షికగా పెట్టేందుకు ఇష్టపడరు. కానీ, బిల్ల మహేందర్ ఆ పేరును ఎంచుకోవడం ఒక సాహసం. ‘రెండు రాత్రులు ఒక స్వేచ్ఛ’ అనే కవితలో కవి మూడు అంశాలను స్పృశించారు. మొదటి రెండు భాగాలలో సామాజిక స్పృహ, అంబేద్కర్, పేదరికం గురించి చర్చిస్తారు. మూడో భాగంలో వ్యక్తిగత నైతికత, స్వేచ్ఛ ప్రాముఖ్యతపై రాస్తారు. ‘రాత్రి దిక్కు తెలియక అటు ఇటు వెళ్తున్నప్పుడు, కూడలి మధ్య నిలబడి దారి చూపుతున్న అంబేద్కర్ చూపుడు వేలు వైపు నడిచాను’ అంటారు కవి.

ఇందులో సామాజికంగా వెనుకబడివర్గాల ప్రజలు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను తెలుసుకొని పాటించడం ద్వారా తమ వెనుకబాటుతనం దూరం కావచ్చనే విషయాన్ని కవి తెలియజేస్తారు. రెండోది, ఉండటానికి ఇల్లు లేని పేదవర్గాల ప్రజలు రాత్రిళ్లు ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న ఆ దృశ్యాన్ని మన కళ్లముందు ఉంచారు. మూడోది, మన ద్వారా బాధపడేవారి గురించి మనం పట్టించుకోం, కానీ మనకు ఎవరి ద్వారానైనా ఇబ్బంది కలిగితే.. ఓర్చుకోలేమనే స్వేచ్ఛాపోరాటం గురించి కవి తెలియజేశారు.

లోతైన భావాలు

బిల్ల మహేందర్ కవితలను ఒక సగటు పాఠకుడిగా చదవాలనుకుని పుస్తకం తెరిచాను. మొదటి పేజీ తెరవగానే నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఇవి కేవలం అభ్యుదయ భావజాలంతో రాసినవని అనుకున్నాను. కానీ, సంపుటి పూర్తిగా చదివితే అర్థమైంది. కవి కష్టజీవుల ఆవేదనను, అణచివేతకు గురైన సామాన్యుల బాధను ప్రపంచానికి తెలియజేయడమే ధ్యేయంగా రాశారని. ‘వేలాడే కలలు’ కవితలో ‘వాళ్లు పొద్దున్నే పువ్వోలే వికసిస్తూ నగరబాట పడతారు’ అంటూ కార్మికుల జీవితాన్ని పరిచయం చేశారు.

నగరాల్లో కనిపించే అందమైన భవంతులు వారి శ్రమతో నిర్మించినవి. రాత్రి వరకు శ్రమించి, అలసిన ముఖాలతో గుడిసెలో కలల్ని వేలాడదీసి, మరుసటి రోజు మళ్లీ సూర్యుడితో పోటీ పడి పనికి వెళ్తారు. ఈ కవితలో కవి కార్మికులను సూక్ష్మంగా పరిశీలించడమే కాకుండా, తనే ఒక కార్మికుడై ఆ బాధను పంచుకున్నారు. ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ అనే కవిత ఈ సంపుటికి పేరయింది.

కవితలో కవి ‘పేరులో మనిషిని మాయం చేసి, మతాన్ని వెతుకుతున్నారు, కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు’ అంటారు. వాస్తవికతకు అద్దం పట్టే ఈ కవితలు పాఠకుడిని ఆలోచింపజేయడమే కాకుండా, సమాజంలోని అసమానతలపై పోరాడే శక్తినిస్తాయి. కేవలం సాహిత్య ప్రక్రియగానే కాకుండా, సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలిచే ఈ కవితా సంపుటి, అభ్యుదయ సాహిత్య లోకంలో ఓ  చెరిగిపోని సంతకం. 

-ప్రకాష్ సమీక్షకుడు

-బిల్ల మహేందర్, కవి