8 June, 2026 | 3:03 AM

అయిటి వచ్చింది.. వడ్లు పోకపోయే!

08-06-2026 12:41 AM
  1. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం  
  2. ఆందోళనలో రైతులు

బెజ్జంకి, జూన్ 7 : వర్షాకాలం (అయిటి) ప్రారంభమై రైతులు కొత్త సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ, గత సీజన్లో పండించిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోనే నిల్వ ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో పలువురు రైతులు నారు మడులు సిద్ధం చేస్తుండగా, మరికొందరు విత్తనాలు నాటేందుకు, పొలాలను దుక్కులు దున్నేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే గత పంటకు సంబంధించిన ధాన్యం విక్రయ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కొత్త సాగుకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవడం రైతులకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం ధాన్యం విక్రయాలపైనే ఆధారపడుతున్నామని, కానీ కొనుగోలు చేసిన ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే ఉండిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉండగా, లిఫ్టింగ్ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, నాణ్యత దెబ్బతింటే భారీ నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు రోహిణి కార్తెను అనుసరించి నారు మడులు సిద్ధం చేయడంతో పాటు విత్తనాలు నాటే పనులను ప్రారంభించారు. మరికొందరు రైతులు ట్రాక్టర్లతో పొలాలను దుక్కులు దున్నిస్తూ కొత్త పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో గత సీజన్ ధాన్యం కొనుగోలు, లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలులో ఆలస్యం..

పంట పండించడం మా చేతిలో ఉం ది.. కానీ అమ్ముకోవడం మాత్రం మా చేతిలో లేదు. మార్కెట్లో ధాన్యం ఉండగానే కొత్త పంట పనులు మొదలవుతు న్నాయి. ఒకవైపు అప్పులు, మరోవైపు పె ట్టుబడుల భారం మమ్మల్ని వేధిస్తోంది. ధాన్యం కొనుగోలు ఆలస్యం రైతు కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది.

 రైతు, ఆనంద్

మండలంలోని పది ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.12 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరిగాయి. ఇందులో 1.06 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఇప్పటికే లిఫ్ట్ అయింది . రెండు కొనుగోలు కేంద్రాలు పూర్తి అయినవి . ప్రస్తుతం సుమారు లిఫ్ట్ చెయ్యవలసింది6 వేల క్వింటాళ్ల ధాన్యం కేంద్రాల్లో ఉండగా, మరో 6 నుంచి 8 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని . మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన లిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.

- పర్శరాములు, ఏపీఎం.