8 June, 2026 | 4:06 AM

రోడ్డు లేదు.. బస్సు రాదు..

08-06-2026 12:36 AM

మండల కేంద్రానికి వెళ్లాలంటే నరకయాతన

శిలాఫలకాలకే పరిమితమైన రహదారులు

కోటపల్లి, జూన్ 7: ప్రభుత్వాలు మారుతున్నా కోటపల్లి మండలంలో గ్రామాల పరిస్థితులు మాత్రం మారడం లేదు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు ఎక్కడ లేని హామీలు గుప్పించి ఓట్లు దండుకునుడే తప్ప గెలిచిన తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మండల కేంద్రం నుంచి పారుపల్లి గ్రామం వరకు రహదారి నిర్మాణం కోసం ఎన్నోసార్లు ప్రజలు పాలకులకు విన్నవించినా ఫలితం శూన్యమే అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు.

ఇప్పుడే పనులు ప్రారంభించినట్లు హడావిడి చేసి శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి హడావుడి చేసిన నాయకులు రోడ్డు మాత్రం వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంతోనైనా గ్రామాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించి ఓటు వేసిన మండల ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.

‘ప్రజా పాలన’ అని చెప్పుకునే ప్రభుత్వం అసలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంలో పూర్తిగా విఫలమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూర్ నియోజక వర్గంలో ఒకరికి మంత్రి, ఎంఎల్‌ఏ పదవి, మరొకరికి ఎంపీ పదవి దక్కినా మండల ప్రజలు ఆశించిన అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మండల కేంద్రానికి వెళ్లాలంటే నరకయాతన..

కోటపల్లి మండల కేంద్రం నుంచి సర్వాయిపేట, ఎసన్వాయి, ఎడగట్ట, పిన్నారం, పారుపల్లి తదితర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సు కూడా రావడం లేదు. దీనితో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు చేరాలన్నా ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నాయకులకు మాత్రం సోయి రావడం లేదు.

ప్రధాన సమస్య అయిన రహదారిని రాజకీయ నాయకులు ఎన్నికల అస్త్రంగా మార్చుకుని ఓట్లు దండుకుంటున్నారే తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నాయకుడు మాత్రం కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇప్పటికైనా గ్రామాల సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని పలు గ్రామపంచాయతీల ప్రజలు తీర్మానించేందుకు సిద్ధమవుతున్నట్లు, ‘అభివృద్ధి చేయని నాయకులకు ఓటు ఎందుకు వేయాలి’ అంటూ ప్రజలు బహిరంగంగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సమస్యలు పరిష్కరించకపోతే ఓటు ద్వారా బుద్ధి చెప్పే సమయం ముందుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.