ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
- సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
- కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్
సూర్యాపేట, మే 5 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి సివిల్ సప్లయ్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు, సిబ్బందితో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు.
అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియ, మౌలిక వసతులు, ధాన్యం నిల్వ, నిర్వహణ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే నరసింహ, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ కొండలరావు, డీఎస్‌ఓ మోహన్ బాబు, డీఎం శ్రీధర్ రెడ్డి, డీసీవో ప్రవీణ్, డీఎంవో నాగేశ్వర శర్మ, తహసీల్దార్ కృష్ణయ్య, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై సమీక్ష
రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదును 48 గంటలలోపు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు.మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్ లో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పీపీసీ కేంద్రాల నిర్వహణ, ధాన్యం నిల్వలు, రవాణా, మిల్లింగ్, సంబంధిత ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.






