6 July, 2026 | 11:44 AM

‘కల్లూరులోనే పుట్టి పెరిగా.. ఈ మట్టి రుణం తీర్చుకుంటా’

06-07-2026 11:06 AM
  1. పాలేరు ఎమ్మెల్యేనైనా సత్తుపల్లి నా సొంత ఇల్లే: మంత్రి పొంగులేటి 
  2. రూ.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  3. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తో  కలిసి విస్తృత పర్యటన

కల్లూరు, (విజయక్రాంతి): "నేను కల్లూరు మండలంలోనే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఈ మట్టితో, ఇక్కడి ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పటికీ నా సొంత ఇల్లే" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  పేర్కొన్నారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. కల్లూరు మండలంలో సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక మౌలిక వసతుల పనులకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తనను ఆదరించిన సొంత గడ్డ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. కల్లూరు కొత్త మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ రూ.15 కోట్ల పనులతోనే ఆగిపోమని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

- సంక్షేమం - అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీలనే కాకుండా, చెప్పని ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పేదల చిరకాల స్వప్నమైన సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇల్లు అందిస్తామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డుల జారీని పునరుద్ధరించామని, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీతో పాటు ప్రతి కుటుంబానికి 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

- ఖాతాల్లో రైతు భరోసా.. మహిళలకు లక్ష్మీకటాక్షం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని, తాజాగా ‘రైతు భరోసా’ కింద తొలి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేయడం ప్రారంభమైందని మంత్రి వెల్లడించారు. రైతుల మొబైల్ ఫోన్లకు ‘టిగ్..టిగ్’ అంటూ మెసేజ్‌లు రావడం మొదలైందని, రాబోయే రెండు మూడు రోజుల్లో అర్హులైన ప్రతి రైతుకూ నిధులు అందుతాయన్నారు. సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 ప్రోత్సాహకం ఇస్తూ.. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

- రూ.15 కోట్లతో మౌలిక వసతుల కల్పన

మండల పరిధిలో రూ.15 కోట్ల వ్యయంతో పలు ప్రతిష్టాత్మక పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరువూరు ఎక్స్ రోడ్ కల్లూరు జంక్షన్ వద్ద ఖమ్మం - అశ్వరావుపేట జాతీయ రహదారి జంక్షన్ అభివృద్ధి పనులను రూ.8.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. అలాగే లోకవరం - పెనుబల్లి రహదారిపై రూ.6.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు, చిన్నకోరుకొండ - కిష్టారం మరియు వైరా - నెమలి రహదారుల మధ్య రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టే లింక్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు నగరాభివృద్ధిలో భాగంగా కల్లూరు ప్రధాన రహదారిలో రూ.93 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) పనులను కూడా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.