సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఉట్నూర్, ఆగస్టు 19: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు,
ఆహార భద్రతతో పాటు అనేక ప్రయోజనాలకు ఇది కీలక ఆధారమన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత శ్రీనివాస్, పీ ఏ సీ ఎస్ చైర్మన్ ఎస్.పీ. రెడ్డి, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






