20 August, 2026 | 2:19 AM

కళ్లు నెత్తికెక్కాయా?

20-08-2026 01:27 AM
  1. రేవూరికి మళ్లీ టికెట్ ఎలా ఇస్తావు?
  2. దమ్ముంటే రాజీనామా చేయించి.. మళ్లీ గెలిపించు
  3. పరకాల గడ్డ.. నా అడ్డా
  4. టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రగా పోటీ
  5. సీఎం.. రేవంతా? పొంగులేటా?
  6. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు

వరంగల్ (మహబూబాబాద్), ఆగస్టు 19 (విజయక్రాంతి): ‘సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? రేవూరికి మళ్లీ పరకాల టికెట్ ఎలా ఇస్తా వు. నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవ రు? టికెట్లు ఇచ్చేది కాంగ్రెస్ అధిష్ఠానం. పరకాల నుంచి నేనే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా’ అని మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతు ల కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె.. పరకాల అసెంబ్లీ స్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. పరకా లలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌రెడ్డి తన కుటుంబానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని సుస్మిత ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రేవంత్‌కు తమ కుటుంబం మద్దతుగా నిలిచిందని, టీపీసీసీ అధ్యక్షుడు కావడంలో తన తండ్రి కొండా మురళి సహకారం ఉందన్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ కాగానే తమ ఇంటికి వచ్చాడని గుర్తు చేశారు. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.. కానీ పదవి ఇవ్వలేదు. కొండా మురళికి హామీ ఇవ్వలేదని దేవుని మీద రేవంత్ ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. 

గతంలో వేం నరేందర్‌రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చారని, ఈ మూడేళ్లలో ఆయన ఏం సలహాలు ఇచ్చారో వెల్లడించాలని సుస్మిత ప్రశ్నించారు. కొండా సురేఖ, మురళి మంచివాళ్ళు కాబట్టి వాళ్లు బయట ఎక్కడ ఏమి మాట్లాడటం లేదన్నారు. తనకు ఎవరన్నా భయం లేదని పేర్కొన్నారు. కొండా మురళి మూములు లీడర్ కాదని.. ఆయన కింగ్ మేకర్ అని అన్నారు. డైపర్లు వేసుకుని తిరిగే రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. 

దమ్ముంటే రేవూరి చేత రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ‘రేవంత్‌రెడ్డి వస్తాడా.. ఆయన బాబు వస్తాడా, వచ్చి రేవూరి తరఫున ప్రచారం చేయండి’  అని సవాల్ చేశారు. నా జోలికి వస్తే అందరి బాగోతం బయటపెడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజయంలో కొండా మురళి కీలకంగా పనిచేశారని సుస్మిత పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవూరికి పరకాల తెలియదని, పరకాలకు రేవూరి తెలియదన్నారు. తర్వాత పరకాల ఎమ్మెల్యే తానేనని.. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అచ్చమైన కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్  మధ్య పోటీ నడుస్తోందని, టీడీపీ నుంచి వచ్చిన నాయకులపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ అని సుష్మిత ప్రశ్నించారు. తమను అనవసరంగా కెలికితే మరిన్ని విషయాలు బయటపెడతాని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డినా అంటూ సుస్మిత వ్యాఖ్యానించారు. ఎప్పుడు చూసినా సీఎం రేవంత్‌రెడ్డి వెంట పొంగులేటి ఉంటున్నాడన్నారు. 

రేవంత్‌రెడ్డి సోదరుల స్కాములు బయటపెడతా

తాను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని సుష్మిత హెచ్చరించారు. సీఎం తమ్ముడి రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే ఇప్పటివరకు మాట్లాడానని, కౌంటర్ ఇస్తే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.  

రేవూరి తరఫున ప్రచారం చేయి

రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే అభ్యర్థిని ఎందుకు ఖరారు చేస్తారని ఆమె ప్రశ్నించారు. రెండేళ్ల వరకు ఎందుకు ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు. వంచనగిరిలో ఉన్న మా ఇంట్లో ఉండి సీఎం రేవంత్‌రెడ్డి.. 

రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం ప్రచారం చేయాలని, అప్పుడు ప్రజలు రేవూరి ప్రకాష్‌రెడ్డిని గెలిపిస్తారా, కొండా సుస్మితని గెలిపి స్తారా అనేది అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు.