డ్రగ్ నెట్‌వర్క్ చేధించిన పోలీసులు
95.41 గ్రాముల ఎండిఎంఏ,
50 గ్రాముల ఓజీ కుష్ సీజ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రగ్ ఆపరేషన్‌లో గచ్చిబౌలి ప్రాంతంలో సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఎస్‌ఓటీ సైబరాబాద్ బృందాలు కలిసి నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు ఇంటర్‌స్టేట్ డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, 95.41 గ్రాముల ఎండిఎంఏ, 50 గ్రాముల ఓజి కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.16.40 లక్షలుగా అంచనా వేశారు.
ఈ సందర్భంగా 16 మంది డ్రగ్ వినియోగదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 11న వట్టినాగులపల్లి కింగ్‌డమ్ పబ్ రోడ్ వద్ద జరిగిన తనిఖీల్లో డ్రగ్ పెడ్లర్ కొరిపెల్ల యశ్వంత్, సాయి షణ్ముక్‌ను 16 మంది వినియోగదారులతో కలిసి అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన ఎండిఎంఏను కేరళకు చెందిన మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ నుంచి సరఫరా అవుతున్నట్లు తేలింది.
ప్రత్యేక బృందాలు 18న కేరళలోని త్రిశూర్‌లో మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్‌ను అరెస్ట్ చేయగా, యశ్వంత్‌కు 44.41 గ్రాములను సరఫరా చేసినట్లు, ఆ డ్రగ్‌ను ‘సామ్’ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి పొందినట్లు వెల్లడించాడు. అదే రోజు బెంగళూరులోని బేగూర్‌లో నవీనా కేడీని అరెస్ట్ చేసి ఆమె నివాసంలో 51 గ్రాముల ఎండిఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ లభించాయి. ఈ డ్రగ్ తన మిత్రుడు అనేశ్వర్ నుంచి అందిందని విచారణలో తెలిపింది. మొత్తంగా 95.41 గ్రాముల ఎండిఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు.






