విద్యార్థుల ఘాతుకం
నల్లగొండలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య స్కూల్ పిల్లల పనే!
27 కత్తి పోట్లు
- ప్రిన్సిపల్ మందలించిందని కక్ష
- జల్సాలకు అలవాటుపడి, డబ్బు కోసం దారుణం
- వారంరోజులుగా రూపారెడ్డి ఇంటి వద్ద రెక్కీ
- నిందితులిద్దరూ చదివేది పదో తరగతే
- జువైనల్ హోంకు తరలించిన పోలీసులు
నల్లగొండ బ్యూరో, ఆగస్టు 19 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డిని చంపింది ఆమె పాఠశాలలోనే చదువు తున్న ఇద్దరు విద్యార్థులని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్లగొండలో ఆయన వివరాలను వెల్ల డించారు. జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బు కోసం ఆమెను హత్య చేశారని తెలిపారు.
15 రోజుల క్రితం హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్న 16 సంవత్సరాల వయసుగల ఓ విద్యార్థి బ్యాగులో సెల్‌ఫోన్‌తో పాటు నగదు కనిపించడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. తదుపరి అతనిని హాస్టల్ నుంచి ఇంటికి పంపి.. డే స్కాలర్‌గా మార్చా రు. ఈ నేపథ్యంలో రూపారెడ్డిపై వారిద్దరూ పగ పెంచుకున్నారు. వారిద్దరిలో ఒకడు మద్యానికి బానిసగా మారాడు. ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం ఎలా అనే విషయాలను శోధించి.. రూపారెడ్డి పాఠశాలలో ఫీజులు వసూలు చేస్తుంది, డబ్బులు ఉంటాయని నిర్ధారణ చేసుకున్న విద్యార్ధులు ప్రిన్సిపాల్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేశారు. అందుకోసం ముందుగానే కొండమల్లేపల్లిలో వారు కత్తి, గ్లౌజులని కొన్నారు. 11వ తేదీన సాయంత్రం రూపారెడ్డి ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఒకరు ఇంటి వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఎవరైనా వస్తున్నారా అనేది గమనిస్తుండగా.. మరొకరు మాస్క్ ధరించి వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు.
అదే సమయంలో ఆమె తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఫోన్ కట్ చేయకుండానే బాబు అని పిలిచినట్లు తెలుకోగలిగామని ఎస్పీ తెలిపారు. అయితే ఇంట్లోకి వెళ్లిన బాలుడు ఆమెపై దాడి చేస్తుండగా మాస్క్ తొలగిపోవడంతో ప్రిన్సిపాల్ అతనిని గుర్తు పట్టిందని చెప్పారు. దీంతో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని వివరించారు. తదుపరి రూ.1.54 లక్షల నగదు, ఐ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లారన్నారు.
50 మందికి పైగా అనుమానితుల విచారణ
హత్య కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సుమారు 50 మందికిపైగా అనుమానితులను విచారించారు. ఈ క్రమంలో ఆధారాల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఇం టి ఆవరణను కవర్ చేస్తున్న ఓ సీసీ ఫుటేజ్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిందని ఎస్పీ తెలిపారు. అలాగే రూపారెడ్డి ఫోన్ మాట్లాడుతూ చివరగా బాబు అని పిలిచిం ది. ఆమె కేవలం పాఠశాలలో చదివే విద్యార్థులను మాత్రమే అలా పిలుస్తుందని తెలయడంతో అనుమానం మరింత బలపడిందన్నారు.
రూపారెడ్డి హత్య నేపథ్యంలో పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. తదుపరి రీ ఓపెన్ అయినా హాజరు కానీ విద్యార్థులపై పోలీసులు దృష్టి సారించారు. వీరిలో పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు బడికి రాకపోగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
వారి నుంచి కత్తి, రూ.లక్షకు పైగా నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. కాగా జల్సా చేసేందుకు నెల క్రితం వీరు గోవా కూడా వెళ్లారని తెలిపారు. వీరిద్దరికి గంజాయి టెస్ట్ నిర్వహించ గా నెగిటివ్ వచ్చిందన్నారు. తమ అదుపులో ఉన్న వీరిని జువైనల్ హోమ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.






