20 August, 2026 | 4:06 AM

తిరుపెల్లివాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

20-08-2026 01:08 AM
  1. తనిఖీలలో 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, కారు స్వాధీనం
  2. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తిరుపల్లి, ఖిరుపల్లి ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని బుధ వారం తెల్లవారుజామున నుంచి నిర్వహించినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి 179 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లు అమర్చిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురి నిందితుల వద్ద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎం వెంకట నర్సయ్య, ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్ర వర్ధన్, సిఐలు బి సునీల్ కుమార్, బి ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి. మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్త్స్రలు, రిజర్వ్ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.