రాష్ట్రాన్ని పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ శుక్రవారం సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణంగా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలు కలుగుతుందన్నారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌తో పాటు ఇతర వ్యూహాత్మక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, పూర్తి చేయాల్సిన గడువులపై సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు.






