పంటలకు ప్రాణాధారం.. ఘనజీవామృతం
రసాయన ఎరువులను తగ్గించడమే లక్ష్యం
వేసవి కాలంలో తయారీకి సిద్ధం
తయారీలో రైతులకు శిక్షణ
సిద్దిపేట, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఎరువుల ధరలు పెరగడంతో రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతున్నారు. రసాయన ఎరువులకు బదులుగా ఘనజీవామృతాన్ని ఉపయోగించి సాగు చేస్తే, భూసారం పెరగడంతోపాటు అధిక దిగుబడిని పొందవచ్చని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నాగార్జున సూచిస్తున్నారు. ఘన జీవామృతం తయారీపై నాగార్జున రైతులకు శిక్షణ ఇస్తూ, వినియోగంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
తయారీ విధానం
వంద కిలోల పశువుల పేడ, ఐదు లీటర్ల పశువుల మూత్రం, రెండు కిలోల ద్విదళ పప్పుల పిండి, రెండు కిలోల బెల్లం, పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను. వీటన్నిటిని బాగా కలిపి గుండ్రటి ఉండలుగా చేసి చెట్టు నీడలో లేదా షెడ్డులో పది రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. ఆ ఉండలను గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఉండలను పొడిగా చేసుకొని పొలంలో జల్లుకోవాలి.
ఘన జీవామృతాన్ని ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోలు వేసుకోవాలి. దానితోపాటు పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోవడం మంచిది. దీనివల్ల భూమి సారవంతంగా మారి మొక్కలో పోషక లోపాలు రాకుండా చేస్తుంది. నారుమడి తయారీలో ఘనజీవామృతాన్ని వినియోగించినట్లయితే ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చు. నాటు వేసే సమయంలో వేరు తెగిపోకుండా సులువుగా నారు తీయవచ్చని, పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చని మరియు యూరియా వినియోగం కూడా తగ్గించవచ్చని పాడి రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఎరువులను నిల్వ చేయాలి..
పాడి రైతులు తమ దగ్గర ఉన్న పశువుల ఎరువుని ఘన జీవామృతం రూపంలో నిలువ చేసుకొవాలి. యూరియాని ఎలా అయితే దఫదఫాలుగా పంటకు అందిస్తాము అదేవిధంగా ఘనజీవామృతాన్ని కూడా పంటకు అందించినట్లయితే భూసారం పెరిగి మొక్కకు సమతుల్యంగా పోషకాలు అందడంతో సహజంగానే మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అవసరమైతే రైతుల వద్దకు వచ్చి తగిన సూచనలు సలహాలు చేయడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉన్నారు. రైతుల కోరుకుంటే ప్రత్యేక శిక్షణ ఇస్తాము.
నాగార్జున, వ్యవసాయ విస్తీర్ణ అధికారి, తోగుట.






