అంతా ‘ఓపెన్’..!?
- బాన్సువాడలో ఓపెన్ పరీక్షలు అంతా... గప్... చుప్...?
- విద్యార్థులకు బదులు.. ఇతరులు హాజరు...
- పరీక్ష కేంద్రాల నుంచి ఇతరులను బయటకు పంపినట్లు సమాచారం..
- పరీక్ష కేంద్రాల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు మౌనమేల...?
బాన్సువాడ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహిస్తున్న ఓపెన్ పదవ తరగతి ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బదులు ఇతర వ్యక్తులు హాజరై పరీక్షలు రాస్తున్నట్లు పలువురు విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా ఓపెన్ పరీక్షలు అంతా ఓపెన్ గా కొనసాగుతున్నాయని పరీక్ష కేంద్రాల్లో ఎవరికి అనుమతులు లేకుండా కిటికీలు మూసివేసి పరీక్షలు నిర్వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులకు బదులు ఇతర వ్యక్తులు హాజరై పరీక్షలు రాయడం పట్ల పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వత్తసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
గత రెండు రోజుల నుండి బాన్సువాడ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బదులు ఇతర వ్యక్తులు హాజరై పరీక్షలు రాస్తున్నారని సమాచారంతో వారిని పరీక్ష కేంద్రాల నుంచి పంపివేసినట్లు విశ్వాసంయ సమాచారం. ఈ విషయమై పరీక్ష నిర్వహణ ఉపాధ్యాయుడిని అడగగా అలాంటిదేమీ లేదని సమాధానం దాటి వేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటు న్నారు. అదేవిధంగా మరొక పరీక్ష కేంద్రం నిర్వహణ ఉపాధ్యాయుని ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం. జిల్లా ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ పై మౌనమేల అని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా పరీక్ష కేంద్రాల నిర్వహణపై జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించి ఇతర వ్యక్తులు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.






