మత్తు పదార్థాల నియంత్రణ, నేరాల నిర్మూలనే లక్ష్యం
- మంచిర్యాలలో భారీ సెర్చ్ ఆపరేషన్
- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైమ్, జూలై 12 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శని వారం రాత్రి మంచిర్యాల పట్టణ పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి మంచిర్యాల డీ సీ పీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ ఇళ్లలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో అర్ధరాత్రి విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. కాలనీని పూర్తిగా చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 20 వేల విలువైన అక్రమ మద్యం నిల్వలు, సరైన పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో కేక్ కట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులకు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రతి వ్యక్తి నిజాయితీగా జీవిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, మంచి పేరు సంపాదించుకోవడమే జీవిత లక్ష్యంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసుల బాధ్యత అని, అదే విధంగా ప్రతి పౌరుడు కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్లపై అసాంఘికంగా ప్రవర్తించడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, ఇతర ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






