16 July, 2026 | 12:55 AM

జాడలేని చినుకు.. నేల పొరల్లోనే విత్తనం.!

16-07-2026 12:42 AM

భారీగా పత్తి సాగు

ఆందోళనలో అన్నదాతలు

కల్వకుర్తి జూలై15: వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది పత్తికి లభించిన మంచి ధరలు, ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్న రైతులు భారీగా పత్తి సాగుకు మొగ్గు చూపారు. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చు చేసి భూములను సిద్ధం చేసి విత్తనాలు వేశారు.

విత్తనం విత్తిన తర్వాత గత 20 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో చాలా చోట్ల విత్తనాలు నేలలోనే మిగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. రెండో, మూడోసారి తిరిగి విత్తనాలు నాటాల్సి రావడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

బోరు బావులపై ఆధారం..

మొలకలను కాపాడుకునేందుకు కొందరు రైతులు బోరుబావుల నుంచి లభిస్తున్న కొద్దిపాటి నీటితో పంటను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నీటి కొరతతో పాటు తెగుళ్ల సమస్య కూడా వెంటాడుతోంది. తీవ్రంగా ఈదురు గాలులు ఇస్తున్నాడంతో విద్యుత్ అంతరాయం కూడా తోడు కావడంతో పంటలు కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ, కనీసం ఆషాఢి వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు సాగు చేపట్టారు. కానీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇకనైనా మంచి వర్షాలు కురిసి పంటలు గట్టెక్కాలని రైతులు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే తక్షణ వర్షాలకు అవకాశాలు కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా వ్యవసాయం అనావృష్టి బారిన పడి రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతామేమోనన్న భయం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగు జరిగే జిల్లాల్లో నాగర్కర్నూల్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వేలాది మంది రైతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  కల్వకుర్తి డివిజన్ పరిధిలోని 4 మండలాల్లో పత్తి 48790 ఎకరాల్లో, మొక్కజొన్న 3359 , కంది595, ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు వర్షాలు లేక ఆందోళన చెందుతున్నారు.