calender_icon.png 20 February, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్ ఏఐదే!

20-02-2026 01:00:44 AM

  1. వర్సిటీలు సాంకేతికత వినియోగంతోపాటు రూపకర్తలుగా ఎదగాలి
  2. ఏఐయూ సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
  3. సాంకేతిక సామర్థ్యాలపైనే దేశాల బలం
  4. బాలకిష్టారెడ్డి, విద్యామండలి చైర్మన్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): భవిష్యత్ అంతా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)దేనని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ (ఏఐయూ) సహకారంతో ఏర్పా టు చేసిన రెండో ‘సెంట్రల్ జోన్ వైస్ చాన్సులర్ల సదస్సు 2025--26’ గురువారం ఘనంగా ప్రారంభమైంది.

“ఏఐ, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సుకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉపకులపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ను ప్రారంభించి మాట్లాడారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీల కలయిక కేవలం శాస్త్రీయ పురోగతి మాత్రమే కాద ని... నేటి విద్యా వ్యవస్థకు అత్యంత అవసరమని స్పష్టం చేశారు.

మన విశ్వవిద్యాలయాలు కేవలం సాంకేతికతను వినియోగించుకునేవిగా మాత్రమే ఉండకూడదన్న గవర్నర్.. భారతీయ నైతికత, విలువలను ప్రతిబింబించేలా స్వదేశీ ఏఐ పరిష్కారాలను రూపొందించే రూపకర్తలుగా మన విద్యా సంస్థలు ఎదగాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో సాంకేతికత పరిణామక్రమాన్ని వివరిస్తూ.. చివరి వ్యక్తి వరకు సాంకేతికత ఫలాలు అందించాలని సూచించారు. ఓయూ వీసీ కుమార్ మొలుగురం మా ట్లాడుతూ... విద్యార్థులను భావి సాంకేతికతకు సిద్ధం చే యాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీలు ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నాయని తెలిపారు.   ఏఐయూ అధ్య క్షుడు ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్, ఏఐయూ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘యూనివర్సిటీ న్యూస్’ ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేష్‌రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.