17 July, 2026 | 11:54 AM

హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో మైలురాయి

17-07-2026 11:53 AM
  1. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పర్యాటక అభివృద్ధికి రూ.13 కోట్లు
  2. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  3. పర్యాటక,ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రజాప్రభుత్వం పెద్దపీట

హుజూర్ నగర్ ,జూలై 16 (విజయక్రాంతి): చరిత్రాత్మకమైన,ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కెప్టెన్ నల్లమల ఉత్తంకుమార్ రెడ్డి విశేష కృషి చేశారు.దేవాలయం పర్యాటక అభివృద్ధికి తెలంగాణ ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల కల్పనతో పాటు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి కోసం రూ.13 కోట్ల అనుమతులను ప్రజాప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధుల మంజూరు చేయడంలో రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మట్టపల్లి మహాపుణ్యక్షేత్రాన్ని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలుమార్లు చర్చించి,ప్రతిపాదనకు ఆమోదం లభించేలా కృషి చేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ నిధులతో మట్టపల్లి ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు,సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి,పర్యాటక మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. దీనివల్ల రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హుజూర్‌నగర్ ప్రాంతంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు.ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మట్టపల్లి క్షేత్ర అభివృద్ధికి పరిపాలనా అనుమతి లభించడం పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు,భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో చెన్నూరి నరసింహారావు కుమారులు మట్టపల్లి దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు,విజయ్ విజయక్రాంతి దినపత్రికతో మాట్లాడుతూ...గత ప్రభుత్వాల హయాంలో పరమ పవిత్రమైన మట్టపల్లి లక్ష్మీ నరసింహుడి పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోలేదని... స్థానిక ఎమ్మెల్యే,మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో అత్యంత పవిత్రమైన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని పర్యాటక అభివృద్ధికి రూ.13 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి,ప్రజాప్రభుత్వానికి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు.