వానల కోసం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు
ప్రత్యేక పూజలు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రార్థనలు...
సిద్దిపేట రూరల్: సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లి గ్రామ ప్రజలు గ్రామదేవతలకు జలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం గ్రామంలోని అన్ని గ్రామదేవతలు, దేవాలయాల్లోని దేవతలకు రైతులు, మహిళలు, యువకులు భక్తిశ్రద్ధలతో జలాభిషేకాలు చేసి వర్షాభావం తొలగాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, కుంటలు నిండి వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, రైతుల కష్టాలు తీరాలని, పంటలు సమృద్ధిగా పండాలని దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామదేవతల ఆశీర్వాదం కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






