17 July, 2026 | 11:51 AM

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆ గ్రామాల్లో విషాదఛాయలు

17-07-2026 11:50 AM

అశోక్ లేలెండ్ వాహనంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఢీకొన్న లారీ 

కటికె రషీద్, ఆటో డ్రైవర్ రాములు దుర్మరణం.. గౌస్ కు గాయాలు

పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో విషాదఛాయలు 

 పాపన్నపేట,జులై17: పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన కటికె రషీద్ తన సోదరుడు కటికె గౌస్, పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు ముగ్గురు తమ అశోక్ లేలెండ్ వాహనంలో ఎప్పటిలాగే గురువారం రాత్రి హైదరాబాదులో మేకలు, గొర్రెల వ్యాపారం చేసేందుకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కటికె రషీద్ (42) పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు (48)  దుర్మరణం చెందారు. కటికె గౌస్ కు గాయాలతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో పాపన్న పేట, నార్సింగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో మేకలు, గొర్రెల వ్యాపారం చేస్తున్న రషీద్, గౌస్, డ్రైవర్ రాములు ముగ్గురు కలిసి తమ వాహనంలో గురువారం రాత్రి వెళ్లి ఘట్‌కేసర్ వద్ద తమ వాహనంలో రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వెనుక వైపు నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రషీద్, డ్రైవర్ రాములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గౌస్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కష్టపడి పనిచేసే రషీద్, రాములు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.