ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి
నేరేడుచర్ల,జూలై 17(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి,భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు యారవ శ్రీనివాస్ తో కలిసి శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులను దగా చేస్తున్నాయని మండిపడ్డారు.హెల్త్ టెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో నెంబర్ 12 రద్దు చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వమే అందించాలన్నారు. సిపిఎస్ సంస్థ హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేసి కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న 54 వేల పెండింగ్ క్లైమ్ ల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్,జిల్లా కమిటీ సభ్యులు,మండల కోశాధికారి గుంజ రవీందర్,కరీముల్లా, బిక్షం,దుబాయ్ మేస్త్రి, ఈశ్వరయ్య,నరేష్,శివ, కరుణాకర్ తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.






