calender_icon.png 20 February, 2026 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్‌లో గర్భిణికి ‘ఐజీఆర్‌టీ’తో చికిత్స

20-02-2026 12:59:19 AM

  1. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యుల విజయం

స్థిరంగా ఉన్న మహిళ ఆరోగ్యం..

గర్భంలోని శిశువు ఎదుగుదల సాధారణంగా ఉందన్న డాక్టర్లు 

హైదరాబాద్, ఫిబ్రవరి19(విజయక్రాంతి): వైద్య రంగంలో అరుదైన ఘట్టంగా, హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు గర్భిణికి హైగ్రేడ్ గ్లియోమా అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్‌టీ)ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. గర్భంలోని శిశువుకు ఎటువంటి హాని కలగకుండా రేడియేషన్ థెరపీ అందించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.48 ఏళ్ల మహిళ పలుమార్లు ఐవీఎఫ్ ప్రయత్నాల అనంతరం గర్భం దాల్చారు. గర్భధారణ 20వ వారంలో ఆమెకు ఎడమ థాలామస్ ప్రాంతంలో లో-గ్రేడ్ గ్లియోమా గుర్తించబడింది.

నవంబర్ 2025లో శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ట్యూమర్ మళ్లీ పెరుగుతున్నట్లు స్కాన్ల లో తేలింది. ఈ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని న్యూరోసర్జరీ, రేడియేషన్ అండ్‌మెడికల్ ఆంకాలజీ, ఓబీజీ, నీయోనటాలజీ, అనస్థీషియా, ఎథిక్స్ కమిటీ సభ్యులతో ప్రత్యేక మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డు సమావేశమైంది. గర్భంలోని శిశువు భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని కీమోథెరపీని వాయి దా వేసి, అత్యంత కచ్చితమైన ఐజీఆర్‌టీ చికిత్సను ఎంచుకున్నారు.ఈ సందర్భంగా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కవిత ఉప్పల మాట్లాడుతూ గర్భధారణ సమయంలో క్యాన్సర్ చికిత్స సవాల్‌తో కూడుకున్నది.

తల్లి ప్రాణాన్ని రక్షిస్తూ, శిశువుకు రేడియేషన్ ప్రభావం పడకుండా చేడటం మా బాధ్యత. ఐజీఆర్‌టీ సాంకేతికత ద్వారా ట్యూమర్‌ను మాత్ర మే లక్ష్యంగా చేసుకొని, ప్రత్యేక షీల్డింగ్, కచ్చితమైన డోస్‌ప్లానింగ్‌తో చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రసూతి, ఆంకాలజీ నిపుణుల సంయుక్త పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. గర్భం లోని శిశువు ఎదుగుదల సాధారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు.