శివకోటేశ్వర ఆలయానికి పునర్జీవం
రూ.4.50 కోట్లతో కాట్రపల్లి కాకతీయుల శివాలయం పునరుద్ధరణ
(మహబూబాబాద్, విజయక్రాంతి): 12వ శతాబ్దంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివ కోటేశ్వరాలయం కొత్తరూపు సంతరించుకోనుంది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాట్రపల్లి కాకతీయుల కాలం నాటి శివాలయానికి మహర్దశ పట్టనుంది. శిథిలాల నుంచి శోభాయమానంగా రూపుదిద్దుకో నుంది. పురావస్తు, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో పునర్నిర్మా ణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలగమ నంలో శిథిలావస్థకు చేరిన ఆలయానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తు న్నారు.
దీంతోపాటు చారిత్రక, ఆనాటి శిల్పకళ నిర్మాణ శైలిని పరిరక్షించేలా పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ద్వారా నాలుగున్నర కోట్ల నిధులను రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి కేటాయించారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన కాట్రపల్లి గ్రామంలోని శివ కోటేశ్వరాలయం గతం లో సరైన సంరక్షణ లేక శిథిలావస్థకు చేరింది. ఆలయంలోని పురాతన స్తంభాలు, రాతి నిర్మాణాలు కొన్ని దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణకు ప్రత్యేకచర్యలు చేపట్టింది. దీంతో ఆలయ పునరుద్ధరణలో భాగంగా నాటి కాకతీయుల శివాలయం అధ మశిల నుంచి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. భూగర్భం నుంచి ఆలయ శిఖరం వరకు ప్రతి శిలకు ప్రత్యేకంగా సంఖ్యను కేటాయిం చి, తొలగిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి అసలు రాతి నిర్మాణాలు, స్తంభాలు, శిల్పాలు, ద్వారబంధాలు, మండప నిర్మాణాలను సాధ్యమైనంత వరకు యథాతథంగా సంరక్షిస్తూ పనులు నిర్వహిస్తున్నారు.
శిల్పాలకు ప్రత్యేక రక్షణ
ఆలయంలోని గర్భగుడి, అంతరాళం, మండపం, స్తంభాలు, ద్వారబంధాలు, రాతి శిల్పాలు అత్యంత విలువైనవిగా భావిస్తున్నారు. హంస లు, ఏనుగులు, కీర్తిముఖాలు వంటి శిల్పాలతో కూడిన స్తంభాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పునర్నిర్మాణ సమయంలో ఈ శిల్పాలకు ఎలాంటి నష్టం కలగకుండా నిపుణుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు. దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, స్థపతులు, దేవాలయ పునర్ నిర్మాణంలో నిష్ణాతులైన వారు పనులను చేపట్టారు.
వీరంతా ఆలయ నిర్మాణ శైలిని పూర్తిగా ఆకలింపు చేసుకుని, తొలగించిన శిలలను ఆలయ ఆవరణలో వరుస క్రమంలో పేర్చుతున్నారు. పూర్తిగా ఆలయ అధమశిల నుంచి ప్రాకారం వరకు ఉన్న శిలలను తిరిగి అదే రీతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతీయుల కాలం నాటి ప్రధాన ఆలయాలైన వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం తరహాలోనే కాట్రపల్లి శివాలయం నిర్మాణ శైలి పోలి ఉండడం గొప్ప విశేషంగా చెబుతున్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఈ ప్రాంతంలో కాట్రపల్లి శివాలయం భవిష్యత్తులో నాటి కాకతీయుల శిల్ప సంపదకు నిదర్శనంగా నిలుస్తుంది.
బండి సంపత్ కుమార్






