కరీంనగర్‌లో ఏసీబీ సోదాలు
టౌన్ ప్లానింగ్‌లో రికార్డుల పరిశీలన
కరీంనగర్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు లోతుగా పరిశీలించినట్టు సమాచారం. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్లు, వాటి పరిశీలన, పెండింగ్ దరఖాస్తులు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిబంధనలు పాటించారా అనే అంశాలపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై గతంలో అధికారులు తీసుకున్న చర్యలు, జారీ చేసిన నోటీసులు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.






