31 August, 2026 | 3:12 AM

కులానికో యూనిక్ కోడ్ ఇవ్వాలి

31-08-2026 01:06 AM
  1. అప్పటిదాకా కులగణన వాయిదా వేయాలి
  2. కాదని గణన కొనసాగిస్తే 12,800 కోట్ల ప్రజాధనం వృథా
  3. దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిక
  4. న్యూ ఢిల్లీ జాతీయ సదస్సులో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్ టి. చిరంజీవులు డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రతి కులానికి ప్ర త్యేక యూనిక్ కోడ్ కేటాయించకుండా కులగణన నిర్వహించడం శాస్త్రీయ పద్ధతి కాదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక కాలమ్ ఉన్నట్లుగానే, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్, అలాగే జనరల్ వర్గాలకు కూడా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, డ్రాప్‌డౌన్ మెనూ ద్వారా యూనిక్ కోడ్ ఇచ్చిన తర్వాత మాత్రమే జనగణన చేపట్టాలని బీసీ ఇంటెలెక్టువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు (BC Intellectual Forum Chairman T. Chiranjeevulu) డిమాండ్ చేశారు.

ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చిరంజీవులు అధ్యక్షతన జనగణనలో ప్రతికులానికి యూనికోడ్ ఉండాలనే డి మాండ్‌తో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెం ట్స్ అసోసియేషన్ తరఫున గౌడ కిరణ్ కుమార్ సమన్వయం వహించారు.

ఈ సదస్సులో మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, అనిల్ జైహింద్ (చైర్మన్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం), విల్సన్ (రాజ్యసభ సభ్యుడు, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్), డాక్టర్ సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ (స్వరాజ్ ఇండియా), ప్రొఫెసర్ రతన్ లాల్,  బాల్‌రాజ్ గౌడ్ , సుగురు దుర్గయ్య గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

దేశవ్యాప్త ఏకాభిప్రాయం ఏర్పడేవరకు కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రక్రియను నిలిపివేయాలని లేకుండా ఇందుకు అయ్యే ఖర్చు రూ. 12,800 కోట్ల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందన్నారు. గణన కొనసాగిస్తే దేశవ్యాప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

బీసీ సెన్సస్‌ను కాంగ్రెస్, బీజేపీ ఆచరించడం లేదు: శ్రీనివాస్‌గౌడ్

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయం, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెజార్టీ వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. జనాభాపై రాహుల్‌గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సెన్సస్ బీసీ జనగణనను బీజేపీ ఆచరించడం లేదని ఆరోపించారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేస్తే న్యాయపరంగా కూడా ఇబ్బందులు ఎదురుకావన్నారు. ప్రతికులానికి నెంబరింగ్ ఇవ్వకుండా న్యాయం ఎలా చేస్తారని కాంగ్రెస్, బీజేపీలను నిలదీశారు.

అసలు లెక్కలు తేలితే వీరి పునాదులు కదులుతాయని భయపడుతున్నారా? అని నిలదీశారు. బ్యాంకులను ఎగ్గొట్టిన, మోసం చేసిన వారిలో బీసీలు లేరని ఈ రెండు పార్టీలు బీసీల గొంతుకోస్తున్నాయని విమర్శించారు. దేశంలో 80 కోట్లకుపైగా ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో జనాభాకు అనుగుణంగా వాటా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు పరిమితం కాకుండా ఓబీసీలకు మద్దతుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని,ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన బాట పడతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.