25 April, 2026 | 2:18 AM

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి బాధాకరం

25-04-2026 12:27 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, ఏప్రిల్ 24(విజయ క్రాంతి) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుర్ఘటన వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటం సమంజసమని, అయితే ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. పోరాటం చేయాలి& గెలవాలి& కానీ బతికి ఉండాలి. ఒక వ్యక్తి తీసుకునే తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబాన్ని చీకటిలోకి నెడుతుంది.

మీరే మీ కుటుంబానికి ధైర్యం, మీరే వారి బలం అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులారా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆత్మహత్యల వంటి నిర్ణయాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఎంత పెద్దవైనా, వాటికి పరిష్కారం ప్రాణాలు తీసుకోవడం కాదని, ధైర్యంగా నిలబడి పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. అవి కుటుంబానికి మరింత బాధను మిగుల్చే నిర్ణయాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కలిసి పోరాడుదాం& న్యాయమైన హక్కులను సాధించుకుందాం. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అని పునరుద్ఘాటించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.