మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే కుట్రను మానుకోవాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని
ఆదిలాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : మద్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏ.ఐ.టీ.యు.సీ అనుబంధ మద్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సంఘం జిల్లా 4వ మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రభుత్వ వైఫల్యాలు, డిమాండ్లను సమీక్షించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా పేద కార్మికుల జీవనోపాధిగా ఉన్న మద్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు కనీస వేతనం రూ. 10 వేలు అందించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులతో పాటు పాఠశాలల్లో వంట షెడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు శుచి, రుచితో కూడిన భోజనాన్ని అందిస్తున్న కార్మికులకు దేశంలోనే అత్యంత తక్కువ వేతనాలు చెల్లించడం శోచనీయమన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘం ఎన్నో పోరాటాలు చేసిందని.. వాటి స్ఫూర్తితో వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టీ.యు.సీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, నాయకులు కన్నెపెల్లి గంగయ్య, జాడె నాందేవ్ తో పాటు పలువురు సంఘం ప్రతినిదులు పాల్గొన్నారు.






