ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
షాద్‌నగర్ / మొయినాబాద్, అగస్టు 18 (విజయక్రాంతి): బహుజన వీరుడు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను షాద్నగర్, మొయినాబాద్లలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాపన్న చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సామాన్య కుటుంబంలో జన్మించి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి, గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన పాపన్న ధైర్యం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. మొయినాబాద్ మండలంలో గౌడ సంఘం, వివిధ పార్టీల నాయకులు పాపన్న పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, గౌడ సంఘ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






