8 August, 2026 | 2:34 AM

సీఎం, మంత్రుల పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలి

08-08-2026 01:18 AM

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్

రంగారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన భద్రత లేక నిరుపేద విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుకు గురై మూడో తరగతి విద్యార్థి రంజిత్ మృతి చెందడంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఈ మరణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వాచ్మెన్లు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన రంజిత్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి పరిహారం చెల్లించాలి.

సర్కారీ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. తన మనవడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ స్కూల్లో  తాగేందుకు నీళ్లు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు  మరుగుదొడ్లు లేవని భద్రతా సిబ్బంది వంటి కనీస వసతులు లేక బహుజన పిల్లలు డ్రాపౌట్లుగా మారడం లేదా ప్రమాదాల బారిన పడటం దారుణమని, ప్రభుత్వం వెంటనే బడుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.